మామ టైటిల్‌తో రెడీ అవుతున్న కళ్యాణ్‌

kalyan Dev movie title vijetha

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

మెగాస్టార్‌ చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇటీవలే డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదలైన విషయం తెల్సిందే. డబ్బింగ్‌ ప్రారంభించినప్పటికి ఇంకా సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రివీల్‌ చేయక పోవడంతో అంతా టైటిల్‌ ఏమై ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు కళ్యాణ్‌ దేవ్‌ మొదటి సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు చిరంజీవి సూపర్‌ హిట్‌ చిత్రం అయిన ‘విజేత’ టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు ఈ టైటిల్‌ ఖచ్చితంగా ప్లస్‌ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

రాకేష్‌ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు ‘విజేత’ అని టైటిల్‌ పెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. గత సంవత్సరం సాయి దరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘విన్నర్‌’ చిత్రానికి మొదట విజేత అనే టైటిల్‌ను పెట్టాలని భావించారు. కాని కొన్ని కారణాల వల్లఆ టైటిల్‌ను కాకుండా విన్నర్‌ అంటూ నిర్ణయించారు. ఇప్పుడు ఆ టైటిల్‌ను చిరు చిన్నల్లుడి కోసం వినియోగించారు. ప్రస్తుతం చివరి దశ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన పలువురు హీరోలు ప్రస్తుతం సక్సెస్‌ కోసం కిందా మీదా పడుతున్నారు. మరి ఈ చిత్రంతో కళ్యాణ్‌కు సక్సెస్‌ దక్కుతుందా అనేది చూడాలి.