టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్న రంగా బావమరిది !

Call Money Accused Chennupati Srinu Joins in TDP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపిలో రాజకీయ చదరంగం మొదలయ్యింది. ఇతర పార్టీలను దెబ్బ తీసేలా అలాగే పార్టీల్లోని ముఖ్య నేతలను కుంగతీసేలా వారి వారి అనుచరులను తమ పార్టీలలో చేర్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న అధికార పార్టీ ఎంపీ అయిన జేసీ ముఖ్య అనుచరుడ్ని వైసేపీ లొంగ తీసుకుని తమ పార్టీ తీర్ధం ఇవ్వగా ఇప్పుడు అది అధికార పార్టీ వంతు వచ్చింది అందులో భాగంగా కృష్ణా జిల్లాలో దివంగత వంగవీటి రంగా బావమరిది, వంగవీటి రాధాకు మేనమామ అయిన చెన్నుపాటి శ్రీను ను పార్టీలోకి చేర్చుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయనతో పాటు వంగవీటి కుటుంబానికి ముఖ్య అనుచరులుగా వున్న చాలా మంది టీడీపీలో చేరనున్నారని సమాచారం.

అర్బన్‌ పార్టీ అధ్యక్షుడు బుద్దా వెంకన్నతో పాటు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సైతం ఆయనను పార్టీలోకి తీసుకురావటానికి తెర వెనుక కృషి చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరకు శ్రీనును తీసుకువెళ్ళినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వంగవీటి మోహనరంగా ఒకప్పటి ముఖ్య అనుచరులతో బుధవారం తన కార్యాలయంలో చెన్నుపాటి శ్రీను సమావేశం కానున్నారు. తన నిర్ణయాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్ళి వారి అభిప్రాయాన్ని తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

టీడీపీకి బలమే

శ్రీనివాస్‌కు నగరంలోని మూడు నియోజకవర్గాలలో కూడా అనుచరగణం, స్నేహితులు, అభిమానులు ఉన్నారు. వంగవీటి రంగా రాజకీయాల్లో వున్న సమయంలో క్రియాశీలంగా వ్యవహరించిన శ్రీను ఆయన మరణం తర్వాత రాజకీయంగా నిశబ్దంగా ఉన్నారు. కాల్‌మనీ కేసుకుముందు తన రాజకీయ భవిష్యత్తును నిర్దేశించు కోవటానికి మూడు నియోజకవర్గాలలో ఆరు సమావేశాలను నిర్వహించారు. ఆ సమావేశాలలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తామంతా మద్దతు పలుకుతామని అనుచరులు కూడా హామీ ఇచ్చారు. కాల్‌మనీ కేసు రావటంతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. కొంత కాలం క్రితం ఈయన వైసీపీ వైపు చూశారని, రాధా నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని కూడా స్థానికంగా ప్రచారం జరిగింది.

తర్వాత జనసేనలో చేరతారని కూడా పుకార్లు వచ్చాయి. పార్టీలో తగిన స్థానం కల్పించి గౌరవిస్తామని వీరు ఇచ్చిన హామీతో టీడీపీలో చేరడానికి శ్రీను నిర్ణయించుకున్నారని తెలిసింది. అర్బన్‌ పార్టీ అధ్యక్షులు బుద్దా వెంకన్నకు, ఆయన సోదరుడికి కూడా శ్రీనుతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈయన పార్టీలో క్రియాశీలంగా పనిచేయటానికి ఆసక్తి చూపిస్తున్నా… ఎమ్మెల్యే రేసులో లేరని తెలియడంతో బొండా ఉమా కూడా శ్రీను చేరికకు కృషి చేస్తుండటం శ్రీను చేరిక లాంచానమే అని తెలుస్తోంది. అయితే కాల్ మనీ కేసుల నుండి బయటపడడానికే శ్రీను టీడీపీలో చేరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమయినా తన తల్లి సోదరుడు ఇప్పుడు తెలుగుదేశం గూటికి చేరితే సొంత మామతోనే పోరాడాల్సిన పరిస్థితి రాదాకి ఏర్పడనుంది.