తూత్తుకుడి ప్ర‌జ‌ల‌కు హైకోర్టులో ఉప‌శ‌మ‌నం

Madras High Court stays construction of new copper smelter by Sterlite

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

11 మంది మ‌ర‌ణంతో తీవ్ర విషాదం నెల‌కొన్న తూత్తుకుడికి త‌మిళ‌నాడు హైకోర్టు ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. తూత్తుకుడిలో వేదాంత లిమిటెడ్ అనుబంధ సంస్థ స్టెరిలైట్ ఇండ‌స్ట్రీస్ చేప‌ట్టిన కాప‌ర్ స్మెల్ట‌ర్ రెండో ప్లాంట్ నిర్మాణాన్ని ఆపేయాల‌ని మ‌ద్రాస్ హైకోర్ట్ మ‌ధురై బెంచ్ ఆదేశాలు జారీచేసింది. ప్లాంట్ నిర్మాణాన్ని నిర‌సిస్తూ మంగ‌ళ‌వారం ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగ‌గా, ప‌రిస్థితులు అదుపుత‌ప్పి పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవ‌డం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చనీయాంశ‌మైంది. ఈ నేప‌థ్యంలో ప్లాంట్ కు వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్ ను విచార‌ణ‌కు స్వీక‌రించిన మధురై బెంచ్ కాప‌ర్ స్మెల్ట‌ర్ ప్లాంట్ నిలిపివేయాల‌ని మ‌ధ్యంత‌ర ఆదేశాలు జారీచేసింది. ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు కోరుతూ వేదాంత తాజాగా కేంద్ర ప్ర‌భుత్వానికి పిటిష‌న్ పంపాల‌ని ఆదేశించింది.

స్టెరిలైట్ విస్త‌ర‌ణ ప్రాజెక్టుపై సెప్టెంబ‌ర్ నాటికి కేంద్ర‌ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవాల‌ని, అప్ప‌టివ‌ర‌కు ప్లాంట్ నిర్మాణం చేప‌ట్టరాద‌ని కోర్టు ఆదేశాలు జారీచేసింది. అటు తూత్తుకుడి ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పోలీసుల కాల్పుల‌పై ప‌లువురు మండిప‌డుతున్నారు. త‌మిళ సినీప‌రిశ్ర‌మ కూడా ఈ ఘ‌ట‌న‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పుతోంది. 11 మంది అమాయ‌కులు మ‌ర‌ణించ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌ని, ఎంతో బాధ క‌లుగుతోంద‌ని సినీ న‌టి రాధిక ఆవేద‌న వ్య‌క్తంచేశారు. మ‌ర‌ణించిన వారి కుటుంబాల గురించి త‌న గుండె కొట్టుకుంటోంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ తీవ్రంగా స్పందించారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. నిర‌స‌న‌ల‌కు దిగిన ప్ర‌జ‌ల‌ను చంప‌డం అన్న‌ది ముందు చూపులేని, వెన్నెముక లేని చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. మీరు ప్ర‌జ‌ల మొర‌ను ఆల‌కించ‌లేరు. కాలుష్యానికి వ్య‌తిరేకంగా గ‌ళ‌మెత్తుతున్న ప్ర‌జ‌ల ఆవేద‌న‌ను మీరు అర్థం చేసుకోలేరు. అధికారంలో కొన‌సాగేందుకు కేంద్రం ప‌ల్ల‌వికి అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారా..అని ప్ర‌కాశ్ రాజ్ ట్విట్ట‌ర్ లో విరుచుకుప‌డ్డారు.