Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తేజ దర్శకత్వంలో బాలయ్య హీరోగా వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఇంకో ఇంటరెస్టింగ్ వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం కూడా చూపించబోతున్నారు. 60 ఏళ్ళ వయసులో సినిమాలు వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ ప్రచారం కోసం రాష్ట్రమంతా కలియదిరిగారు. ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు తిరగనంత విస్తృతంగా ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. పల్లెపల్లెకు తిరిగారు. ఈ పర్యటనలో ఆయన్ని తెలుగు ప్రజల వద్దకు తీసుకెళ్లిన వాహనం చైతన్య రధం. ఓ పాత కారుని తన ప్రయాణానికి అనువుగా ఆయనే దగ్గరుండి మరీ చైతన్య రథంగా మార్పించుకున్నారు. అలాంటి చైతన్య రధాన్ని నడిపే బాధ్యతని కొడుకు హరికృష్ణ కి అప్పగించారు. ఆ చైతన్య రధం తెలుగుదేశం ప్రచారం కోసం దాదాపు 75 వేల కిలోమీటర్లు తిరిగివుంటుందని ఓ అంచనా.
అలాంటి చైతన్యరధం కి ఎన్టీఆర్ బయోపిక్ లో స్థానం కల్పించారు. దాన్ని నడిపిన హరికృష్ణ పాత్రలో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కనిపించబోతున్నారట. తండ్రి పాత్రలో తాను, తాతయ్య పాత్రలో బాబాయ్ అన్న ఆలోచనకే ఉత్సాహపడిపోయిన కళ్యాణ్ చైతన్య రధం నడపడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. త్వరలో చిత్ర యూనిట్ ఇలాంటి మరిన్ని విశేషాల్ని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
నందమూరి హీరోలంతా ఎన్టీఆర్ బయోపిక్ లో కనిపిస్తారని చెబుతున్నప్పటికీ జూనియర్ విషయంలో బాలయ్య పట్టు సడలిస్తారా అన్నది సందేహమే. పైగా బాలయ్య తరపున నిర్మాతలు అడిగితే ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో ?. ఒకవేళ ఎన్టీఆర్ ఒప్పుకుంటే ఆయనకి ఏ పాత్ర ఇస్తారు ? హరికృష్ణ రోల్ లో బాలయ్య కారు నడపడానికి కళ్యాణ్ రామ్ ఓకే అన్న రూమర్ విన్నదగ్గరనుంచి నందమూరి ఫాన్స్ మదిలో లెక్కకుమించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.