చంద్ర‌బాబు ని పొగిడి, వాళ్ళను తిట్టిన క‌మ‌ల్…

Kamal Haasan says Chandrababu is My Hero
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

పూర్తిస్థాయి రాజ‌కీయ‌నేత‌గా మారుతూనే విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సంచ‌న‌ల ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌కీయాల్లో త‌న హీరో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడ‌ని క‌మ‌ల్ హాస‌న్ చెప్పారు. రాజ‌కీయ యాత్ర‌లో భాగంగా ఈ ఉద‌యం రామేశ్వ‌రం వెళ్లిన క‌మ‌ల్ అక్క‌డ అబ్దుల్ క‌లామ్ కుటుంబ‌స‌భ్యుల‌తో భేటీ అయ్యారు. అనంత‌రం మ‌త్స్య‌కారుల‌తో స‌మావేశ‌మయ్యారు. త‌ర్వాత స్థానిక హ‌య‌త్ ప్యాల‌స్ హోట‌ల్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. క‌మ‌ల్ రాగానే అభిమానులు సీఎం వ‌చ్చారు అంటూ నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన క‌మ‌ల్ త‌న రాజ‌కీయ ప‌య‌నం ఏ తీరులో సాగ‌నుందో ప‌రోక్షంగా వివ‌రించారు. తాను మ‌హాత్మాగాంధీ వీరాభిమానిన‌ని, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న హీరో అని తెలిపారు. మంగ‌ళ‌వారం రాత్రి చంద్ర‌బాబు త‌న‌కు ఫోన్ చేశార‌ని, ప్ర‌జ‌ల‌కు ఏం చేయాలి అన్న విష‌యాల‌పై స‌ల‌హాలిచ్చార‌ని వెల్ల‌డించారు. రాజ‌కీయ యాత్ర చేప‌ట్టిన త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న కార్య‌క‌ర్త‌లు, అభిమానులు త‌న‌కు శాలువాలు క‌ప్పుతున్నార‌ని, ఇంకెప్పుడూ ఇలా త‌న‌కు శాలువాలు క‌ప్ప‌వ‌ద్ద‌ని, తానే శాలువాగా మారి ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తాన‌ని క‌మ‌ల్ చెప్పారు.

రామేశ్వ‌రంలో క‌లాం చ‌దివిన పాఠ‌శాల‌కు తాను వెళ్లాల‌నుకున్నాన‌ని, కానీ పాఠ‌శాల యాజ‌మాన్యం త‌న‌కు అనుమ‌తినివ్వ‌లేద‌ని తెలిపారు. స్కూల్ కు రానివ్వ‌కుండా అడ్డుకోగ‌లిగారు కానీ… తాను నేర్చుకోవాల‌నుకున్న విష‌యాల‌ను మాత్రం అడ్డుకోలేర‌ని వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల గుండెల్లో తానున్నాన‌ని, ఇప్పుడు వారి ఇళ్ల‌లోనూ ఉండాల‌నుకుంటున్నాన‌ని చెప్పారు. సినిమాల‌కు, రాజ‌కీయాల‌కు పెద్ద తేడా లేద‌ని, కానీ సినిమాల కంటే రాజ‌కీయాల్లో బాధ్య‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇప్పుడు త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బంతా ప్ర‌జ‌ల‌దేన‌న్నారు. క‌లాం అంత్య‌క్రియ‌ల‌కు ఎందుకు హాజ‌రుకాలేద‌ని చాలామంది అడుగుతున్నార‌ని, సాధార‌ణంగా తాను అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రుకాన‌ని క‌మ‌ల్ తెలిపారు.

అటు కమ‌ల్ వ్యాఖ్య‌లు జాతీయ‌స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. సాధార‌ణంగా ఏ రాష్ట్రానికి చెందిన రాజ‌కీయ నేత అయినా… ఇత‌ర రాష్ట్రాల నేత‌ల‌ను, స‌మ‌కాలీనుల‌ను ఆద‌ర్శ‌నేత‌ల‌గా చెప్పుకోరు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌ను, త‌ర్వాతి త‌రానికి చెందిన నేత‌ల‌ను రోల్ మోడ‌ల్స్ గా భావిస్తుంటారు ప్ర‌స్తుత నేత‌లు. కానీ క‌మ‌ల్ హాస‌న్ చంద్ర‌బాబు త‌న హీరో అని చెప్ప‌డం ద్వారా ద‌క్షిణాదితో పాటు జాతీయ‌స్థాయిలో కొత్త స‌మీక‌ర‌ణాల‌కు తెర‌లేపార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విభ‌జ‌న హామీల విష‌యంలో బీజేపీ ప్ర‌భుత్వంతో చంద్ర‌బాబు క‌య్యానికి కాలుదువ్వుతున్న స‌మ‌యంలో క‌మ‌ల్ చేసిన వ్యాఖ్య‌లు దేశ‌రాజ‌కీయాలు థ‌ర్డ్ ఫ్రంట్ దిశ‌గా క‌దులుతున్నాయ‌న‌డానికి సంకేతంగా భావిస్తున్నారు.