బీజేపీ అధ్యక్ష ప‌ద‌వికి హ‌రిబాబు రాజీనామా… కారణం ఏంటంటే?

Kambhampati Haribabu resigns for AP Bjp President post

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

యువ‌కుల‌ను ప్రోత్స‌హించాల‌న్న‌ది త‌న అభిమ‌త‌మ‌ని, వారికి అవ‌కాశాల కోస‌మే తాను ప‌ద‌వినుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ఏపీ బీజేపీ అధ్యక్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన కంభంపాటి హ‌రిబాబు చెప్పారు. త‌న స్థానంలో ఓ యువ‌కుడిని నియ‌మించాల‌ని కోరారు. టీడీపీ, బీజేపీ మిత్ర‌బంధం తెగ‌దెంపులు అయి… ఇరు పార్టీలు క‌త్తులు దూస్తున్న ప్ర‌స్తుత స‌మ‌యంలో ఏపీలో టీడీపీని ఎదుర్కొనేందుకు దూకుడుగా వ్య‌వ‌హ‌రించే కొత్త నేత‌ను అధ్య‌క్షుడిగా నియ‌మించునున్నార‌ని వార్త‌లొచ్చాయి. మాణిక్యాల‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, సోము వీర్రాజు, పురంధ‌రేశ్వ‌రి వంటివారి పేర్లు కూడా వినిపించాయి. ఈ నేప‌థ్యంలో హ‌రిబాబు త‌నంత‌ట తాను రాజీనామా చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. సోమవారం సాయంత్రం అధ్య‌క్ష‌ప‌ద‌వికి రాజీనామా చేసిన హ‌రిబాబు త‌న రాజీనామా లేఖ‌ను జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. వచ్చేది ఎన్నిక‌ల సంవ‌త్స‌ర‌మ‌ని హ‌రిబాబు త‌న లేఖ‌లో అధిష్టానానికి గుర్తుచేశారు.

నాలుగేళ్ల‌పాటు త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి అధ్య‌క్ష బాధ్య‌త‌లను అప్ప‌గించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకుని రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతానికి కృషిచేశాన‌న్నారు. త‌న రాజీనామాను ఆమోదించాల‌ని కోరారు. త‌న స్థానంలో ఓ యువ‌కుడిని నియ‌మించాల‌ని సూచించారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో హరిబాబు ఏపీ బీజేపీ అధ్య‌క్షునిగా నియ‌మితుల‌య్యారు. టీడీపీతో మిత్ర ధ‌ర్మం కాపాడుతూ నాలుగేళ్ల‌గా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. టీడీపీతో విభేదాలు వ‌చ్చిన స‌మ‌యంలోనూ పూర్తి సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించారు. ఈ స్వ‌భావ‌మే ఆయ‌నకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఎదురుదాడి, దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల్సిన స‌మ‌యంలో త‌న మెత‌క వైఖ‌రితో బీజేపీకి న‌ష్టం క‌లిగించార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. కేంద్రం రాష్ట్రానికి అందించిన సహాయ‌స‌హ‌కారాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారని… హ‌రిబాబుపై జాతీయ నాయ‌క‌త్వం అసంతృప్తిగా ఉంద‌నీ వార్త‌లొచ్చాయి. కొత్త అధ్య‌క్షుడి ఎంపిక కోసం అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తుండ‌గానే త‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించి అంద‌రికీ షాకిచ్చారు హ‌రిబాబు. ఆయ‌న స్థానంలో సామాజిక స‌మీక‌ర‌ణాల ఆధారంగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుంద‌ని భావిస్తున్నారు.