ఆ ఐదుగురిలో హరి “బాబు”ఒక్కడే.

Kambhampati hariBabu to meet Amit Shah today
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలతో ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భేటీ లో చాలా లెక్కలు తేలబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తు , నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల్లో ఈ సమావేశం తరువాత బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం వుంది. ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షం టీడీపీ తో విభేదాలు పొడసూపుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకొంది. సామాన్యంగా వివాదాస్పద అంశాల జోలికి వెళ్లని ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇటీవల బీజేపీ మిత్రధర్మం పాటించాలని చెప్పడంతో పాటు అవసరం అయితే వాళ్లకు ఓ దండం పెట్టి తప్పుకుంటాం అనే రీతిలో మాట్లాడ్డం మీద కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం వుంది. ఇంత కీలకమైన సమావేశానికి బీజేపీ హైకమాండ్ కేవలం ఐదుగురు నేతలు మాత్రమే హాజరు అయ్యేలా చర్యలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధాని మోడీ తో భేటీ విషయంలో ఇలాంటి కొన్ని నిబంధనలు పాటించినా అమిత్ షా మాత్రం ఇలాంటివి పట్టించుకోరు. పార్టీ తరపున వీలైనంత ఎక్కువ మందిని కలవడానికి ఆయన ఆసక్తి చూపుతారు. కానీ ఈసారి ఐదుగురు మాత్రమే రావాలని చెప్పడం లో లోగుట్టు ఏదో వుంది అనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ భేటీకి హాజరు అయ్యే ఐదుగురు లో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు, సంస్థాగత కార్యదర్శి రవీంద్ర రాజు , ఎమ్మెల్సీ సోము వీర్రాజు , కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి వుండే అవకాశం వుంది. ఈ ఐదుగురిలో సోము. పురందేశ్వరి ఎప్పటినుంచో టీడీపీ అధినేత చంద్రబాబుకి వ్యతిరేకంగా బీజేపీ అధిష్టానాన్ని నడిపించడానికి శాయశక్తులా ప్రయత్నం చేస్తున్న వాళ్ళే. ఇక అటుఇటు గా వుండే విష్ణు కుమార్ రాజు ఈ మధ్య ఏకంగా వైసీపీ ఆఫీస్ లో ప్రెస్ తో మాట్లాడిన విషయం , అయిన రాద్ధాంతం, వివరణలతో సైలెంట్ అయిన వైనం తెలిసిందే.ఇక రవీంద్రరాజు మాత్రం పార్టీ ప్రయోజనాలు తప్ప మిగిలిన విషయాలు పెద్దగా పట్టించుకోరని పేరుంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా పని చేస్తున్న కంభంపాటి హరిబాబు ఒక్కరే బీజేపీ , టీడీపీ పొత్తు కొనసాగాలనే భావిస్తున్నారు.భేటీ కి వెళ్లే ముందు కూడా సన్నిహితులతో ఆయన ఇదే విషయాన్ని చెప్పి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ ఐదుగురిలో హరి ఒక్కడే బాబు కి అనుకూలంగా వాదిస్తారు.

ఈ భేటీ తర్వాత వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటో దాదాపు గా తెలిసిపోయే అవకాశం వుంది. ఒకవేళ బాబుకు అనుకూలంగా నిర్ణయం ఉంటే ఆయన వ్యతిరేకుల్ని కాస్త తగ్గి ఉండమని నచ్చజెప్పే ఛాన్స్ వుంది. అలా గాకుండా వైసీపీ తో పొత్తుకు వెళదామనుకుంటే ఈ భేటీ తర్వాత బీజేపీ లో బాబు వ్యతిరేక గళం వినిపించే వాళ్ళ గొంతు లౌడ్ స్పీకర్ లో వినిపించడం ఖాయం. మొత్తానికి ఈరోజు సమావేశం బీజేపీ , టీడీపీ సంబంధాలను తేల్చబోయే కీలక ఘట్టం.