Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కంచి కామకోఠి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశ క్రతువు శాస్త్రోక్తంగా ముగిసింది. గురువారం ఉదయం 8గంటలకు మహాసమాధి ప్రక్రియ ప్రారంభించారు. బృందావన ప్రవేశంగా పిలిచే ఈ అంతిమ సంస్కారాల ప్రక్రియ అభిషేకంతో మొదలయింది. కంచి కామకోఠి పీఠం ప్రధాన హాల్ లోని అభిషేకం పీఠం వద్దకు జయేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని తీసుకువచ్చారు.
అనంతరం పాలు, తేనె వంటి ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఉత్తర పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం పూర్వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర స్వామిని అధిష్టానం చేసిన చోటనే జయేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని బృందావన ప్రవేశం చేశారు. ఈ క్రతువును వీక్షించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తమిళనాడు గవర్నర్ భన్వర్ లాల్ పురోహిత్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, డాలర్ శేషాద్రి, టీటీడీ మాజీ ఈవో కనుమూరి బాపిరాజు తదితరులు జయేంద్రసరస్వతికి నివాళులర్పించారు.