కంచి పీఠాధిప‌తి జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి శివైక్యం

Jayendra Saraswathi passes away

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
కంచికామ‌కోఠి పీఠాధిప‌తి జ‌యేంద్ర‌స‌రస్వ‌తి శివైక్యం చెందారు. ఈ ఉద‌యం 9గంట‌ల స‌మ‌యంలో కాంచీపురంలోని ఓ ఆస్ప‌త్రిలో ఆయ‌న ప‌ర‌మ‌ప‌దించారు. 82 ఏళ్ల జ‌యేంద్ర స‌రస్వ‌తి కొంత‌కాలంగా శ్వాససంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. అయితే నిన్న‌టివ‌ర‌కు ఆయ‌న కంచిమఠంలోనే ఉన్నారు. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రీలాల్ పురోహిత్ మంగ‌ళ‌వారం మ‌ఠానికి వ‌చ్చి స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ త‌ర్వాత రాత్రి స‌మ‌యంలో జ‌యేంద్ర‌స‌రస్వ‌తికి ఒక్క‌సారిగా శ్వాస‌స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో శిష్యులు ఆయ‌న‌ను కాంచీపురంలోని ఓ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ఆయ‌న‌కు మెరుగైన చికిత్స అందించిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది.

ఈ ఉద‌యం 9గంట‌ల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు. జ‌యేంద్ర స‌ర‌స్వ‌తి 1935, జులై 18న త‌మిళ‌నాడు మ‌న్నార్ గుడి స‌మీపంలోని ఇరుల్ నిక్కి గ్రామంలో జ‌న్మించారు. ఆయ‌న అస‌లు పేరు సుబ్ర‌హ్మ‌ణ్య మ‌హాదేవ అయ్య‌ర్. 1954, మార్చి 22న కంచిపీఠంలో చేరిన ఆయ‌న జ‌యేంద్ర స‌రస్వ‌తిగా మారారు. చంద్ర‌శేఖ‌ర్ స‌ర‌స్వ‌తి స్వామి అనంత‌రం 1994 జ‌న‌వ‌రి 3న‌ కంచి పీఠానికి 69వ పీఠాధిప‌తిగా నియ‌మితులయ్యారు. అభిన‌వ శంక‌రునిగా ఆయ‌న ప్ర‌సిద్ధి చెందారు. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో కంచి పీఠం మ‌రింత‌గా వృద్ధి చెందింది. ఆయ‌న‌ నేతృత్వంలో కంచిపీఠం అనేక సామాజిక కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. చెన్నైలోని శంక‌ర్ నేత్రాల‌య‌, అసోంలోని గౌహ‌తి వ‌ద్ద శంక‌ర‌దేవ నేత్రాల‌య వంటివి స్థాపించారు. అనేక పాఠ‌శాల‌లు, పిల్ల‌ల ఆస్ప‌త్రి, హిందూ మిష‌న్ ఆస్ప‌త్రి వంటివి సైతం కంచి పీఠంనిర్వ‌హిస్తోంది.