వ్యక్తిగతంగా కూడా నేను ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నాను : కంగనా రనౌత్‌

వ్యక్తిగతంగా కూడా నేను ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నాను : కంగనా రనౌత్‌

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అకాల మరణంతో బాలీవుడ్‌లోని బంధుప్రీతి, అభిమానవాదం వంటి అంశాల గురించి సోషల్‌ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌, సుశాంత్‌ ఆత్మహత్యపై మండిపడిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ది హత్యా.. ఆత్మహత్యా అని ఆమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో తనకు ఇంతవరకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడించారు కంగనా.

‘ఒకసారి జావేద్‌ అక్తర్‌ నన్ను తన తన ఇంటికి పిలిపించాడు. అక్కడికి వెళ్లాక ఆయన రాకేష్‌ ‘రోషన్‌ కుటుంబానికి సమాజంలో చాలా పలుకుబడి ఉంది. నువ్వు గనక వారికి క్షమాపణ చెప్పకపోతే.. నువ్వు ఎక్కడికి వెళ్లలేవు. వారు నిన్ను జైలుకి పంపిచగలరు. అప్పుడిక నీకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో దారి ఉండదు అంటూ బెదిరించారు’ అని కంగన చెప్పుకొచ్చారు. అంతేకాక ‘నేను వారికి క్షమాపణ చెప్పకపోతే ఎక్కడికి వెళ్ళలేనని అతను ఎందుకు అనుకున్నాడు. హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పకపోతే.. నేను ఆత్మహత్య చేసుకోవలసి వస్తుందని అతను ఎందుకు భావించాడో నాకు ఇప్పటికి అర్థం కావడం లేదు. తన ఇంట్లో జావేద్‌ నా మీద గట్టిగా అరిచాడు. అతని ప్రవర్తనకు నేను షాక్‌కు గురయ్యాను’ అన్నారు కంగన. అంతేకాక ‘సుశాంత్‌ను కూడా ఎవరైనా పిలిచి ఇలానే బెదిరించారేమో.. ఆత్మహత్య లాంటి ఆలోచనలను అతడి బుర్రలోకి పంపించారేమో నాకు తెలియదు. అతడు కూడా నాలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడేమో చెప్పలేను’ అని కంగనా అనుమానం వ్యక్తం చేశారు.

వృత్తిపరమైన బెదిరింపులకు సంబంధించి తన వాదనలను నిరూపించేందుకు కంగనా ఓ సంఘటనను తెలిపారు. ‘ఆదిత్య చోప్రా వల్ల సుశాంత్‌ నష్టపోయాడని నాకు తెలుసు. సుల్తాన్‌ సినిమాను తిరస్కరించినప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను. సుల్తాన్‌ సినిమాను తిరస్కరించడంతో ఆదిత్య చోప్రా నాతో ఎప్పటికి సినిమాలు చేయనని బెదిరించాడు. ఇండస్ట్రీ మొత్తం నాకు వ్యతిరేకంగా మారింది. ఆ సమయంలో నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను ఒంటరిదాన్నని అనిపించింది. గొప్పవారమని చెప్పుకునే వీళ్లంతా.. నీతో ఎప్పటికి పని చేయనని చెప్తున్నారు. వారికి ఆ అధికారం ఎక్కడిది. ఒకరితో పని చేయాలనుకోవడం, వద్దునుకోవడం నా ఇష్టం. కానీ దాని గురించి బయటకు ఎందుకు చెప్పాలి. గ్యాంగ్‌లు కట్టి ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఇలాంటి ప్రవర్తనను ప్రశ్నించాలి. వారి చేతికి అంటుకున్న రక్తం గురించి వారే సమాధానం చెప్పాలి. ఇలాంటి వారి గురించి నిజాలు వెల్లడించడానికి నేను ఎక్కడికైనా వెళ్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగింది చాలు’ అంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కంగనా మాట్లాడుతూ.. ‘వృత్తిగత జీవితంలోనే కాక వ్యక్తిగతంగా కూడా నేను ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నాను. ప్రతి విషయం పట్ల వారు చాలా అభద్రతాభావంతో ఉంటారు. నాకు జరిగిన దాని గురించి వదిలేయండి.. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని కూడా ఇలానే భయపెట్టారు. దాంతో తను నా నుంచి దూరం కావడం ప్రారంభించాడు. తను నా నుంచి పారిపోతున్నాడని తెలిశాకే వారు స్థిమితపడ్డారు. ఆ సమయంలో నా కెరీర్‌ గురించి ఎలాంటి ఆధారం లేదు. నా ప్రేమ విఫలమయ్యింది. వారు ఇప్పటికే నా మీద ఆరు కేసులు పెట్టారు. నన్ను జైలుకు పంపే ప్రయత్నాలను ఇప్పటికి ఆపలేదు’ అని చెప్పుకొచ్చారు.

కంగన మాట్లాడుతూ.. ‘అయితే నేను కొంచెం భిన్నమయిన మనిషిని. నా అభిప్రాయాలను సూటిగా వ్యక్తికరిస్తాను. ఇబ్బందులను దాటుకుంటూ వచ్చాను.. వాటిని అధిగమించాను. అయితే సుశాంత్‌ నాల కాదు. వీటన్నింటిని తనలోనే దాచుకున్నాడు. అతడిని రాక్షసుడిగా చూపించడంలో మీడియా కూడా గణనీయమైన పాత్ర పోషించింది. సుశాంత్‌ ఎంత మంచివాడో.. మానవత్వం గల మనిషో అతని సన్నిహితులకు తెలుసు. ఎప్పుడో ఓ సారి ఈ విషయం గురించి మనకు తెలుస్తుంది. ఎందుకుంటే వారు ముందు నన్ను కూడా మంత్రగత్తేగా, మాయలాడిగా చిత్రీకరించారు’ అని తెలిపారు.

‘నా జీవితంలో నేను ఎదుర్కొన్న బెదిరింపులు, ఇబ్బందులు నాపై ఎంతో ప్రభావాన్ని చూపాయి. తొలినాళ్లలో ప్రజలు నా ఇంటికి వస్తే.. వారికి మంచి నీరు ఇవ్వాలన్నా నేను ఇబ్బంది పడేదాన్ని. ఆ తర్వాత ఓ బంధం అస్తవ్యస్తంగా ముగిసింది. మణికర్ణిక సమయంలో ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. సుశాంత్‌ వీటిని దాటుకుని రాలేకపోయాడు. ఈ గ్యాంగ్‌లు అతడిని తక్కువ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి. సుశాంత్‌ సినిమాలు గల్లీబాయ్‌ కంటే ఎక్కువ వసూలు చేశాయి. గతంలో సల్మాన్‌ ఖాన్‌ లాంటి వారు సుశాంత్‌​ ఎవరని ప్రశ్నించారు. ఎమ్‌.ఎస్‌.ధోని సినిమా తర్వాత అతడి గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది. మనం ఇలాంటి పరిస్థితులను ఆపాలి’ అని కంగనా కోరారు.