బాలీవుడ్ బ్యూటీ, డేరింగ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన అభిప్రాయాలు, కామెంట్లతో వైరల్‌గా మారుతుంది. ఏ విషయాన్నైనా, ఎవరితోనైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడుతుంది. తాజాగా ఈ స్టార్ హీరోయిన్ ఓ మహిళా విలేకరిపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటిదాకా హీరోయిన్గా, కాంట్రవర్సీ క్వీన్‌గా అలరించిన కంగనా తాజాగా హోస్ట్‌గా వ్యవహరించనుందన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించనున్న రియాల్టీ షో ‘లాక్ అప్’కు వ్యాఖ్యతగా సందడి చేయనుంది కంగనా.
ఈ షో మరికొన్ని రోజుల్లో ఆల్ట్ బాలాజీ, ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీల వేదికగా ప్రసారం కానుంది. అయితే ఈ షో ఫార్మాట్‌ను తెలియజేస్తూ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంగనా జర్నలిస్ట్‌ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఒక లేడీ జర్నలిస్ట్ ‘మేడమ్, ఈ మధ్య కాలంలో మహిళలు ధరించే దుస్తులను బట్టి వారి ప్రవర్తనపై వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల దీపికా పదుకొణె కూడా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇలాంటి కామెంట్స్‌తో టార్గెట్ చేయబడ్డారు. దీనిపై మీ స్పందన ఏంటీ ?’ అని అడిగారు.
దీంతో ‘చూడండి, ఎవరైతే తమను రక్షించుకోలేరో వారిని రక్షించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ఆమె తనను తాను రక్షించుకోగలదు. ఆమెకు ఆ సామర్థ్యం ఉంది. అయితే ఆమె సినిమాను నేను ఇక్కడ ప్రమోట్ చేయను. కాబట్టి, మీరు కూర్చొండి.’ అంటూ అసహనంగా సమాధానం ఇచ్చింది కంగనా రనౌత్.