Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మానవత్వానికి దేశం, జాతితో పనిలేదని నిరూపించిన కేన్సస్ హీరోకు ప్రముఖ మ్యాగజైన్ టైమ్ నుంచి అరుదైన గౌరవం లభించింది. 2017లో ప్రపంచంపై విశ్వాసం కలిగించిన ఐదుగురు హీరోల జాబితాలో టైమ్ ఆయన పేరు చేర్చింది. కుల, మత, జాతి బేధాలు పట్టించుకోకుండా అత్యంత సాహసోపేతంగా వ్యవహరించిన హీరోకు సముచిత గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళ్తే… అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నెలరోజులకే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన జాతి విద్వేష దాడిలో హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతిచెందిన సంగతి తెలిసిందే. ఓలెత్ లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్ లో కూచిభొట్ల శ్రీనివాస్, మాదసాని అలోక్ పై ఆడమ్ ప్యూరింటన్ అనే అమెరికన్ కాల్పులు జరిపాడు. నా దేశం నుంచి వెళ్లిపొండి అని అరుస్తూ ఆడమ్ దాడిచేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ మృతిచెందగా… అలోక్ కు తీవ్ర గాయాలయ్యాయి.
ఆడమ్ ను అడ్డుకోవడానికి అమెరికాకే చెందిన ఇయాన్ గ్రిలాట్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన ఛాతీలోకి బుల్లెట్ దూసుకుపోయింది. మొదట ఆడమ్ కాల్పులకు దిగడం చూసిన ఇయాన్… అతనికి కనిపించకుండా…ఓ బల్ల వెనక దాక్కున్నాడు.ఆడమ్ వద్ద తూటాలు అయిపోయాయని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని అడ్డుకోవడానికి ఇయాన్ బల్ల వెనక నుంచి దూకాడు. కానీ ఇయాన్ అనుకున్నట్టుగా ఆడమ్ వద్ద తూటాలు అయిపోలేదు. ఒక తూటా మిగిలే ఉంది. దాంతో ఆడమ్ ఇయాన్ ను కాల్చాడు. ఆ తూటా ఇయాన్ ఛాతిలోకి దూసుకెళ్లింది. అనంతరం ఆయన్ను ఆస్పత్రిలో చేర్చగా… కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నారు. ఇతరుల ప్రాణాలు కాపాడబోయి… తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఇయాన్ కేన్సస్ హీరోగా అందరి ప్రశంసలూ అందుకున్నారు. ఇటీవల హ్యూస్టన్ లోని ఓ భారత-అమెరికన్ కమ్యూనిటీ ఇయాన్ ను నిజమైన అమెరికా హీరోగా అభివర్ణించింది. ఇయాన్ కోసం లక్ష డాలర్ల నిధులు సేకరించి ఇచ్చింది. ఇప్పుడు ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ కూడా ఈ హీరో సాహసాన్ని గుర్తించింది.