టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లి ప్రస్థానం పూర్తిగా ముగిసింది. పరిమిత ఓవర్ల కెప్టెన్గా రోహిత్ శర్మ ఇప్పటికే పగ్గాలు చేపట్టగా.. టెస్టు సారథి ఎవరన్న అంశంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ వంటి యువ ఆటగాళ్ల సారథ్యంలో కోహ్లి ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా వన్డే సిరీస్కు గాయం కారణంగా హిట్మ్యాన్ దూరం కాగా.. రాహుల్ నేతృత్వం వహించనున్నాడు.
ఈ జట్టులో కోహ్లి సభ్యుడుగా ఉన్నాడు.ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లి తన ఇగోను పక్కనపెట్టి జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా శ్రీకాంత్, అజారుద్దీన్ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని, అయితే అందుకు ఏమాత్రం ఫీలవలేదని చెప్పుకొచ్చారు.