కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్-జేడీఎస్ కూటమి దెబ్బకి కాషాయపార్టీ మూలనబడింది. మూడు లోక్‌సభ, రెండు శాసనసభ స్థానాలు సహా ఐదు స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి విజయం ఖరారైంది. ఇక బీజేపీ కంచుకోట శివమొగ్గలో సైతం బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్నులొట్టబోయినట్టు తయారైంది. ఈసారి ఆ పార్టీ ఇక్కడ స్వల్ప మెజారిటీతో గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా శివమొగ్గ ఎంపీ స్థానానికి మాజీ సీఎం యడ్యూరప్ప రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర పోటీ చేయగా, జేడీఎస్ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప బరిలో దిగారు.
అలాగే బళ్లారి ఎంపీ బి.శ్రీరాములు మొల్కమ్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అలాగే జేడీఎస్ నేత, మాండ్య ఎంపీ సీఎస్ ముత్తరాజ్ మెల్కొటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అంతేకాక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలు రామనగర్, చన్నపట్నా నుంచి గెలుపొందారు. రామనగర్ స్థానానికి రాజీనామా చేశారు. జామ్‌ఖండి ఎమ్మెల్యే సిద్దూ నాయమగౌడ్ మరణించడంతో ఇక్క డ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు గాలి కంచుకోట లాంటి బళ్లారి లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉగ్రప్ప విజయం సాధించారు. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థి శివరామగౌడ గెలిచారు.
జమఖండి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్‌సిద్దు న్యామగౌడ గెలుపొందారు. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి విజయం సాధించారు. అలాగే జమఖండి అసెంబ్లీ స్థానంతో పాటు బళ్లారి లోక్‌సభ స్థానంలో ఇప్పటికే కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో మోడీకి కర్ణాటక మరో షాక్ ఇచ్చినట్టు అయ్యింది.