దేశవ్యాప్తంగా కార్తిక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. సోమవారం రోజున పౌర్ణమి రావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాలకు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆ మహదేవుడి నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. వేకువజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు ఆలయాల వద్దకు చేరుకుని గరళకంఠుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి కార్తిక దీపారాధన చేస్తున్నారు.
తెలంగాణలోని భద్రాద్ది శ్రీ సీతారామస్వామి క్షేత్రం, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. భక్తులంతా తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. మరోవైపు ఏపీలోని విజయవాడలో కృష్ణా , రాజమహేంద్రవరంలో గోదావరి నదుల్లో పుణ్య స్నానాలు చేసి దీపజ్యోతి చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం, వేములవాడ తదితర ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
కార్తీక మాసం సందర్భంగా పిల్లాపెద్దా అంతా కలిసి తెల్లవారుజామునే చేరుకుంటున్న భక్తులతో శైవక్షేత్రాలు రద్దీగా మారాయి. కార్తీక దీప కాంతులు, భక్తుల కోలాహలంతో శైవాలయాలు అంగరంగ వైభవంగా విరాజిల్లుతున్నాయి.