కత్తి వ్యాఖ్యల ఎఫెక్ట్… రాత్రంతా పోలిస్ స్టేషన్ లోనే… నేడు రిమాండ్ కి !

తెలుగు బిగ్ బాస్ సీజన్ వన్ కంటేస్తంట్, సినీ క్రిటిక్ కత్తి మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన పై
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇటీవల ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో భాగంగా కత్తి మహేశ్‌ ఫోన్‌ ఇన్‌లో మాట్లాడుతూ.. హిందూ దేవుడు రాముడిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ఆరాధ్య దైవాన్ని కత్తి మహేశ్‌ నోటికి వచ్చినట్టు మాట్లాడటంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్‌ కార్యకర్త కిరణ్‌ నందన్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీసీ 295(1), 505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు… హైదరాబాద్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12లోని ఆనంద్ బంజారా కాలనీ, ప్లాట్ నంబర్ 29లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు, నోటీసులు ఇచ్చి, అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పి, తమవెంట తీసుకెళ్లారు.

ఇక గత రాత్రి స్టేషన్ లో ఉంచిన ఆయన్ను, దేవుడి గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? ఎందుకు చేశారు? గతంలో ఇటువంటి వ్యాఖ్యలు ఎప్పుడైనా చేశారా? వంటి ప్రశ్నలు సంధించి, కత్తి చెప్పిన సమాధానాలను సరిపోల్చుకున్నట్టు సమాచారం. తాను చట్టానికి కట్టుబడి ఉండే వ్యక్తినని, భారత న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని తెలిపినట్టు సమాచారం. గతంలోనూ తాను ఎన్నడూ ఏ దేవుడినీ కించపరచలేదని ఈ సందర్భంగా కత్తి పోలీసులతో అన్నట్టు తెలుస్తోంది. ఎవరి మనోభావాలనూ దెబ్బతీయాలన్న ఉద్దేశం తనకు లేదని వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. నేడు ఆయన్ను కోర్టు ముందు హాజరు పరచి కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రిమాండ్‌కు తరలించనున్నారు. కత్తిపై వివిధ స్టేషన్లలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి.