Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిని చికాకు పెట్టే సినిమాగా అభివర్ణించిన కత్తి మహేశ్ నందమూరి బాలకృష్ణ 102వ సినిమా జైసింహ పైనా రివ్యూ ఇచ్చాడు. బాలయ్య అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న జైసింహను కత్తి కలగూరగంప అని విమర్శించాడు. 1980ల నాటి కథకి, 1990లనాటి కథనం ఈ సినిమా అని కత్తి విశ్లేషించాడు. సినిమా కథకు గతి లేదని, గమనం లేని కథనంతో కొనసాగిందని అభిప్రాయపడ్డాడు. నిరర్ధకమైన కథలో అసంబద్ధమైన పాత్రలో బాలయ్య కనిపించాడని, ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారో కూడా తెలియదని ఎద్దేవా చేశాడు. అజ్ఞాతంలోకి మరో సంక్రాంతి సినిమా అంటూ కత్తి మహేశ్ తన ట్వీట్ ముగించాడు. ఓ యూట్యూబ్ ఛానల్ లో కూడా కత్తి మహేశ్ జైసింహను రివ్యూ చేశాడు.
ఫస్ట్ హాఫ్ లో కథ ఎటు వెళ్తుందో అనే సందేహంలో ఉంటామని, చివరి, పది, పదిహేను నిమిషాల్లో అది బాలయ్యకు సంబంధించిన సెంటిమెంట్ కథ అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ కథలో క్లారిటీ లేదని, గతంలో బాలయ్య చేసిన సినిమాలకు విరుద్దంగా ఈ కథ ఉందని, బాలయ్య అభిమానులను సైతం జై సింహ నిరాశపరుస్తుందని కత్తి మహేశ్ అన్నాడు. బాలకృష్ణకు తగ్గ హీరోయిజం, బలం ఆ పాత్రలో లేవన్నారు. కథలో బాలయ్య ఉన్నాడు తప్ప, బాలయ్య వల్ల కథ నడవలేదన్నాడు. ముగ్గురు హీరోయిన్లలో నయనతార పాత్ర కొంచెం బాగానే ఉన్నప్పటికీ..మిగిలినవారికి అంత స్కోప్ లేదని తెలిపాడు.
బ్రహ్మానందంలాంటి కమెడియన్లు ఉన్నప్పటికీ..ఫస్టాఫ్ లో కామెడీ పండలేదని, సెకండాఫ్ లో అసలు కామెడీనే లేదని విమర్శించాడు. భట్ సంగీతం రెండు పాటల్లో మాత్రమే బాగుందన్నాడు. కథ, కథనం బాగోలేకపోవడంతో కేఎస్ రవికుమార్ దర్శకత్వ ప్రతిభ మరుగున పడిపోయిందన్నాడు. అయితే ఫైట్ సీక్వెన్సస్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయన్నారు. మరి కత్తి రివ్యూపై బాలయ్య అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.