రేపే రద్దు ముహూర్తం…అంతా వారు చెప్పినట్ట్టే…!

Kcr Assembly Dissolving Time Fixed

తెలంగాణలో రాజకీయాలు నిముష నిముషానికి మారిపోతున్నాయి. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్, అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఆయన రేపు ఉదయం 6.45 గంటలకు అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ జాతక బలాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు, ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఆయనకు అనుకూలంగా ఉందని చెప్పడంతో ఆయన రేపు ఉదయం క్యాబినెట్ భేటీ నిర్వహించి అందులోనే ఈ రద్దు తీర్మానం చేసి గవర్నర్ కు సమర్పించనున్నారు. రేపుసింహలగ్నం. కేసీఆర్ కు అనుకూలించే సంఖ్య 6. ఏ రకంగా చూసినా 6 అనే అంకె కలిసొచ్చేలా ఈ ముహూర్తాన్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రేపు ఉదయం మంత్రులందరూ అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. సంబంధిత అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులు బుధవారం పలు ప్రారంభోత్సవాలు, కార్యక్రమాలతో బిజీగా ఉండనున్నారు. వారంతా ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. గురువారం ఉదయం 6 గంటల సమయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సుమారు అర్ధ గంట పాటు సాగే సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ రద్దు గురించే చర్చిస్తారు. అనంతరం అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేస్తారు. ఆ ప్రతితో సరిగ్గా 6.45 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకొని గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది.

kcr-diasolving-sabha-assemb

తెలంగాణ అసెంబ్లీ కాల పరిమితి జూన్ 2 వరకూ ఉంది. కానీ, ఆరు నెలల ముందుగానే అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ సిద్ధమవడంతో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. కేంద్రం నుంచి స్పష్టత తీసుకున్న తర్వాతే కేసీఆర్ ఆ దిశగా ముందుకు వెళుతున్నట్టు సమాచారం. డిసెంబర్‌లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. అప్పటివరకూ కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు చేయనున్న కేసీఆర్ ఆ వెంటనే ఎన్నికల యుద్ద రంగంలోకి దూకుతున్నారు. సెప్టెంబర్ 7న సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో బహిరంగ సభను నిర్వహించడానికి తలపెట్టారు. దీని పేరును ‘ప్రజా ఆశీర్వాద సభ’గా ఖాయం చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 50 రోజుల్లో ఇలాంటివి 100 సభలు నిర్వహించతలపెట్టారు. వీటికి సంబంధించిన ప్రచార రథాలు, సామగ్రి కూడా ఇప్పటికే సిద్దం అయినట్లు తెలుస్తోంది. శుక్రవారం నిర్వహించనున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’ తొలి ఎన్నికల ప్రచార సభ కావడంతో టీఆర్‌ఎస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పాత కరీంనగర్‌లో కీలక ప్రాంతమైన హుస్నాబాద్‌ను సభ నిర్వహణ కోసం వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కూడా కేసీఆర్ అక్కడి నుండే తన ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు అందుకే ఈ సారి కూడా అక్కడి నుండే మొదలుపెట్టడం సెంటిమెంట్ గా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

kcr-assemble