ఎన్టీఆర్ రికార్డు బద్దలేస్తున్న కేసీఆర్ !

KCR Breaking NTR's Record

అప్పట్లో నందమూరి తారక రామారావు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాక్ నడుస్తోంది. దివంగత నేత ఎన్టీఆర్ సాధించిన అరుదైన ఘనతను కేసీఆర్ బద్దలు కొడుతున్నాడని చెప్పుకుంటున్నారు జనం. కేసీఆర్ కి ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానం. పెద్దాయనను తన రాజకీయ గురువుగా కూడా పేర్కొంటారు కేసీఆర్. అందుకే తన కొడుకు కేటీఆర్ కు అన్నగారి పేరే పెట్టారు. అయితే అదే టీడీపీని తెలంగాణలో అధికారం చేపట్టాక కేసీఆర్ తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్ కేసీఆర్ లలో ఓ పోలిక స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ సొంతంగా పార్టీలు స్థాపించి రాజకీయాల్లో తిరుగులేని విధంగా అధికారం చేపట్టిన నేతలే. ఎన్టీఆర్ సొంతంగా టీడీపీని స్థాపించి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ కూడా సొంతంగా పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి రాష్ట్రాన్ని సాధించి అనూహ్యంగా రెండు సార్లు ప్రజాబలంతో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ఇప్పుడు కేసీఆర్ తన గురువైన ఎన్టీఆర్ సృష్టించిన రికార్డును బద్దలు కొట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. 1989వ సంవత్సరంలో మీడియాకు లీకులిస్తున్నారనే నెపంతో ఎన్టీఆర్ తన మొత్తం కేబినెట్ లోని 31మందిని తొలగించి సంచలనం సృష్టించారు. ఆ సమయంలో వన్ మ్యాన్ షోగా ప్రభుత్వాన్ని 15 రోజులు నడిపారు. ఇలా ఒక్కడే ప్రభుత్వాన్ని నడపడం దేశంలో ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఇప్పుడు కేసీఆర్ కూడా గద్దెనెక్కాక కేబినెట్ లేకుండా ప్రభుత్వాన్ని ఒక్కడే నడిపిస్తున్నాడు. తనతోపాటు హోంమంత్రిగా మహమూద్ అలీని నియమించినా ఆయన నామమాత్రంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఇలా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపితే కేసీఆర్ మాత్రం ఆ 15 రోజుల రికార్డును అధిగమిస్తున్నారు. ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొడుతున్నారు. డిసెంబర్ 11న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కేబినెట్ లేకుండా ప్రభుత్వం నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో కేసీఆర్ తన కొత్త కేబినెట్ టీంను ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ఈ రకంగా చూస్తే ఎన్టీఆర్ రికార్డు 15 రోజులతో పోలిస్తే కేసీఆర్ కేబినెట్ లేకుండా ఒక్కడే 20 రోజులు నడిపినట్టు లెక్క. దీంతో ఎన్టీఆర్ రికార్డును కేసీఆర్ బద్దలు కొట్టినట్టే. కాకపోతే ఎన్టీఆర్ కు కేసీఆర్ కు మధ్యలో ఉన్నది ఒక్క మహమూద్ అలీనే ఆయన కేసీఆర్ తోపాటు ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ మాత్రం ఒక్కడే పాలించాడు.