కేసీఆర్ కేబినేట్ మరింత లేటు…కారణం అదే !

ముందస్తు ఎన్నికలకి వెళ్లి ఘనంగా గెలిచి రెండవ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, తనతో పటు మంత్రిగా కేవలం మహమూద్ అలీని మాత్రమే ఎన్నుకున్నారు, మిగతా వారిని మంత్రులుగా ఎన్నుకోవడానికి మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేయమని వారం, పది రోజుల కిందటే ప్రగతి భవన్ నుంచి జీఏడీ అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. దాని ప్రకారం వారు అన్నీ రెడీ చేసుకున్నారు. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అధికారికంగా చెప్పకపోయినా పద్దెనిమిదో తేదీన విస్తరణ ఖాయమన్న అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఈసారి కూడా ఆలస్యం తప్పదని సూచనలు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండగానే మంత్రి వర్గ విస్తరణ చేపడతారని అనుకుంటున్నారు కానీ కేసీఆర్ దృష్టి అంతా పార్లమెంట్ ఎన్నికలపైనే ఉంది. కొత్తగా మంత్రులు ప్రమాణస్వీకరం చేసినా వారికి పనేమీ ఉండదు. ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలని నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి … కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టి తెలంగాణకు ఏమేమీ ఇస్తారో క్లారిటీ వచ్చిన తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడతారు. అప్పటి వరకూ ప్రమాణం చేసినా మంత్రులు ఖాళీగా ఉండటమేనని ప్రగతి అందుకే మంత్రి వర్గ విస్తరణ ఆలస్యం కావచ్చని అంటున్నారు. సీనియర్లను నిరాశ పర్చడం ఎందుకని పరిమితంగా ఎనిమిది మందిని మంత్రులుగా ప్రమాణం చేయించాలనే ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ లెక్కన కేసీఆర్ ఒక లిస్టు కూడా తయారు చేసినట్టు చెబుతున్నారు, ఇక కేసీఆర్ సిద్ధం చేసినట్టు చెబుతున్న జాబితాలో కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి లేదంటే పద్మాదేవేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లేదంటే ప్రశాంత్ రెడ్డి, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్, వినయ్ భాస్కర్ లేదంటే జోగు రామన్న, జగదీశ్ రెడ్డి లేదంటే గుత్తా సుఖేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి లేదంటే పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి లేదంటే లక్ష్మారెడ్డి, రెడ్యానాయక్ లేదంటే రేఖానాయక్‌లను మంత్రి పదవులు వరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 17వ తేదీన స్పీకర్ పదవికి నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉన్నందున ఒకరోజు ముందుగానే అభ్యర్థిని కేసీఆర్ ఎంపిక చేస్తారని తెలుస్తోంది. స్పీకర్‌గా మాజీ మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిలో ఒకరిని ఎంపిక చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. వీరితో పాటు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, రెడ్యా నాయక్ పేర్లు కూడా కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.