కలకలం రేపుతున్న షర్మిల ఫిర్యాదు…ప్రభాస్ ను కలవలేదట !

వైసీపీ అదినేత జగన్ చెల్లి షర్మిల ఈరోజు సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విష ప్రచారం గురించి హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రముఖ హీరో ప్రభాస్ తో తనకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం వెనకాల తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ అసత్య ప్రచారం పై దర్యాప్తు జరిపి, దీని వెనకాల ఉన్న వాళ్ళను కఠినంగా శిక్షించాలని షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె షర్మిల మాట్లాడుతూ,” ఏ హీరోతో అయితే సంబంధం ఉందని తప్పడు ప్రచారం చేస్తున్నారో, ఆ వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు. ఇదే నిజమని నాపిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్నానని ఈ రోజు మాట్లాడకపోతే ఇదే నిజం అని కొంతమంది అయినా అనుకునే అవకాశం ఉంది కాబట్టి, ఈ తప్పుడు ప్రచారాలను మూలాలతో సహా తొలగించాలనే ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆమె వ్యాఖ్యానించింది.

2014 ఎన్నికలకు ముందు నుండి సినీ హీరో ప్రభాస్‌కు తనకు సంబంధం ఉంది అని ఆన్‌లైన్‌లో దుష్ప్రచారం మొదలు పెట్టారని , ఎన్నికల తరువాత దీనిపై ఫిర్యాదు కూడా చేశామని, పోలీసుల విచారణ అనంతరం కొంతకాలం ఈ విష ప్రచారం ఆగిపోయిందని, కానీ, ఎన్నికలు వస్తున్నాయి కనుక ఈ విషప్రచారానికి మళ్లీ వేగం పెంచారని వ్యాఖ్యానించింది. ఈ ప్రచారాల వెనుక టీడీపీ ఉందని తాను భావిస్తున్నానని, టీడీపీకి పుకార్లు పుట్టించడం కొత్త కాదని, నాన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫ్యాక్షనిస్టు అంటూ పుకార్లు పుట్టించింది, తన అన్న వైఎస్‌ జగన్‌ కోపిష్టి, గర్విష్టి అని పుకార్లు పుట్టించింది కూడా టీడీపీయేనని షర్మిల వ్యాఖ్యానించింది. అయితే ఈ సమయంలో ఏపీ పోలీసుల మీద కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకి ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టే ఇక్కడ పోలీసులకి ఫిర్యాదు చేసానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. హఠాత్తుగా షర్మిల , సోషల్ మీడియా ప్రచారం పై పోలీస్ కంప్లైంట్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మాత్రమే నలుగుతున్న ఈ ప్రచారాన్ని తానే స్వయంగా ప్రధాన మీడియాకు తీసుకువచ్చినట్టు అయిందని భావిస్తున్నారు.

2014 ఎన్నికలకు ముందు ఈ రూమర్లు తీవ్ర రూపం దాల్చడంతో స్వయానా ప్రభాస్ వచ్చి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే సోషల్ మీడియా ప్రచారానికి ఈ ఖండనలు , వివరణలు అడ్డుకట్ట వేయలేకపోయాయి. ఇప్పుడు షర్మిల కంప్లైంట్ ల తర్వాత ఇది ఏమాత్రం తగ్గుతాయా అన్నది సందేహమే. అయితే ఈ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఆమె వ్యాఖ్యలను ఖండించారు. షర్మిళ వ్యాఖ్యలు బాధాకరమని, తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సంఘటన ఏ రాష్ట్ర పరిధిలో జరిగితే, అక్కడే కేసులు నమోదవుతాయని చెప్పారు. రానున్న రోజుల్లో వారి ప్రభుత్వం (వైసీపీ) వచ్చినా… రాష్ట్రంలోని అన్ని కేసులను ఏపీ పోలీసులే విచారించాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలోనే ఏపీ పోలీసులు బెస్ట్ అనే కితాబులు తమకు చాలా సార్లు వచ్చాయని అన్నారు.

రాష్ట్రంలోని 60వేల మంది పోలీసుల మనోభావాలను షర్మిళ దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని మీద టీడీపీ కూడా కౌంటర్ ఇచ్చినది, ఈ వ్యాఖ్యల మీద ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, షర్మిళపై సోషల్ మీడియా ప్రచారానికి, టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఒకరిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడాన్ని తమ అధినేత చంద్రబాబు ప్రోత్సహించరని స్పష్టం చేశారు. జగన్ ను రాజకీయంగా విమర్శించామే తప్ప, షర్మిళ ప్రస్తావన తామెప్పుడూ తీసుకురాలేదని చెప్పారు. వ్యక్తిగత ఆరోపణలు ఏ పార్టీ వాళ్లు చేసినా ఖండించాల్సిందేనని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.