ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయం ఏమిటో చెప్పాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ఈటల రాజేందర్ తప్పు చేయకుండానే ఒప్పుకున్నారా అని ప్రశ్నించారు. ఆయన బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈటలపై అనామకుడు లేఖ రాస్తే సీఎం చర్యలు తీసుకోలేదన్నారు. ఐదేళ్ల క్రితం నుంచి కేసీఆర్‌తో గ్యాప్ ఉంటే ఎందుకు మంత్రిగా కొనసాగారని నిలదీశారు. టీఆర్ఎస్ అభివృద్ధిని బీజేపీ ఖాతాలో ఎలా వేసుకుంటారని మండిపడ్డారు.
ఆరోపణలు చేయాలి కాబట్టి ప్రతిపక్షాలు చేస్తున్నాయని, సమస్యల మీద కాంగ్రెస్, బీజేపీ మాట్లాడేందుకు సబ్జెక్టు లేదని ఎద్దేవా చేశారు. ఈ ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. చిల్లర మల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, జెండా, ఏజెండా లేకుండా పిచ్చి మాటలు మాట్లాడటం వాళ్లకు మాత్రమే చెల్లిందన్నారు.
ఈటలకు టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నష్టం చేయలేదని, 2003లో ఎంత కష్టమైనా పార్టీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్లో పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు చేశారని మండిపడ్డారు. మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అక్కడే మాట్లాడితే పోయేదని, సానుభూతి కోసం ప్రజల దగ్గర మాట్లాడి ఆయనకు ఆయనే దూరం అయ్యారని చెప్పారు. ఈటల రాజేందర్‌ది ముమ్మాటికి ఆత్మ వంచనే అన్నారు. బీజేపీ హుజూరాబాద్‌కు ఏం చేసిందో చెప్పి ఈటల రాజేందర్ ఓట్లు అడగాలన్నారు. ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎంత ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.