ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నాలుగో రోజు ఢిల్లీలో ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అమిత్ షాను శాలువాతో సత్కరించిన సీఎం.. పలు కీలక విషయాలు చర్చించారు. ఐసీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మారిన జోన్లు, కమిషనరేట్లు, ఎస్పీ పోస్టులకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కోరారు.
తెలంగాణలో జిల్లాల పునర్విభజనకి ముందు 9 పోలీస్ జిల్లాలు, 2 కమిషనరేట్లు ఉండేవి. విభజనాననంతరం 9 కమిషనరేట్లు, 20 పోలీసు జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఐపీఎస్ క్యాడర్ సిబ్బందిని నియమించాల్సి ఉందని.. ప్రస్తుతమున్న సీనియర్ క్యాడర్ పోస్టులను 76 నుంచి 105కి, ఐసీఎస్ క్యాడర్ పోస్టులను 139 నుంచి 195కి పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర హోం మంత్రికి విన్నవించారు. సుమారు 45 నిమిషాల పాటు భేటీ సాగింది. అలాగే రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఉద్యోగుల విభజన కూడా చేపట్టాలని కేంద్రానికి కోరారు.