భాగ్యనగర ప్రజలకు కేసీఆర్ శుభవార్త

భాగ్యనగర ప్రజలకు కేసీఆర్ శుభవార్త

గ్రేటర్ ఎన్నికల వేళ భాగ్యనగర ప్రజలకు కేసీఆర్ శుభవార్త తెలిపారు. ఇకపై నగర ప్రజలు ఎవరూ నాలా బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల వరకు మాత్రమే వాటర్ బిల్లు చెల్లించాలన్నారు. డిసెంబర్ నుంచి ఎవరూ కూడా ఒక్క రూపాయి కూడా వాటర్ బిల్లు చెల్లించాల్సిన పనిలేదన్నారు. వంద శాతం పూర్తిగా నీటిని ఉచితంగా అందిస్తామన్నారు. దీని వల్ల 97 శాతం ప్రజలకు లబ్ది చేకూరుతుందన్నారు. అయితే 20వేల లీటర్లకు పైబడి నీటిని వినియోగించిన వారికి మాత్రం కొంత ఛార్జీలు విధిస్తామన్నారు.

అయితే నీటి వృధాను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. చాలామంది నీటిని నిర్లక్ష్యంగా వృధా చేస్తుంటారన్నారు. అలాంటివి అరికట్టేందుకు 20వేల లీటర్లు పైబడి ఎవరైనా నీరు వాడితే వారికి ఛార్జీలు విధిస్తామన్నారు.

ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. దేశంలో హైదరాబాద్ గొప్ప నగరమన్నారు. ప్రస్తుతం జంట నగరాల్లో ఎక్కడా మంచి నీటి సమస్య లేదన్నారు. మిషన్ భగీరథతో నీటి సమస్యలు తొలగిపోయాయన్నారు గులాబీ బాస్. గతంలో నీటి కోసం వాటర్ ట్యాంకర్ల వద్ద యుద్ధాలు జరిగేవని గుర్తు చేశారు.

ప్రస్తుతం కొన్ని చోట్ల రెండు రోజులకొకసారి నీళ్లు వస్తున్నాయన్నారు. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి కూడా ఉండదన్నారు. వరద నీటి నివారణకు రూ.12వేల కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. జీరోకార్బన్ సిటీగా హైదరాబాద్‌ను మారుస్తామన్నారు. కాలుష్యం కూడా నియంత్రణ చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదాన్నరు. నగరంలో లక్షలాదిగా ఎలక్ట్రిక్ వాహనాల్ని పెంచుతామన్నారు. శాంతి భద్రతల విషయంలో కూడా నగరం ఎంతో బాగుందన్నారు.