కేసీఆర్ ప్లాన్ అదే….అప్పుడు ఎన్టీఆర్ ఇప్పుడు కేటీఆర్…!

KCR Makes Son TRS Working President To Focus On National Politics

విజయవంతంగా రెండోసారి తెలంగాణ సీఎం ప్రమాణం చేశారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రస్తుతం దేశ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుండటం పై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయనిలా ఎందుకు మాట్లాడుతున్నారు ? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అంటూ కేసీఆర్ చేస్తున్న ఆలోచనల వెనుక ఏం దాగివుంది? అనే కోణంలో ఈ విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తన కొడుకు కేటీఆర్ చేతిలో పెట్టాలనే ఆయనిలా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. భారత దేశంలో కాంగ్రెస్, బీజేపీ కి దీటుగా కొత్త కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా కావాల్సిందేనని కేసీఆర్ నొక్కి చెబుతున్నారు. అంతేకాదు తానే ఆ కాన్సెప్ట్ తెచ్చి తీరుతాయా అని మీడియా ముఖంగా అంటున్నారు. దేశమంతా తిరుగుతానని పేర్కొంటూ నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం కోసం కృషి చేస్తానని వెల్లడిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇక ఆయన తెలంగాణపై ఎక్కువగా ద్రుష్టి పెట్టరని స్పష్టంగా అర్థమవుతోంది. కేసీఆర్ చేష్టలు చూస్తుంటే వారసత్వం పేరుతో రాష్ట్రాన్ని కేటీఆర్ చేతిలో పెడితే ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో తాను ఢిల్లీలో చక్రం తిప్పాలి కాబట్టి తెలంగాణను కేటీఆర్ చూసుకుంటారని చెప్పి కొడుక్కు పగ్గాలు కట్టబెట్టాలని చూస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ పూర్తి బాధ్యతలను కేటీఆరే చూసుకుంటారని.. కేసీఆర్ కూడా.. మరో అభిప్రాయానికి తావు లేకుండా ప్రకటించారు. అంటే ఇక టీఆర్ఎస్‌లో నెంబర్ 2 కేటీఆరే. అంతిమంగా ఏదైనా పరిష్కరించాల్సి వస్తే బిగ్‌బాస్‌గా కేసీఆర్ దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది.

ktr-kcr

ఈ ప్రకటన వచ్చిన తర్వాత టీఆర్ఎస్‌లోని కొంత మంది సీనియర్ల దగ్గర్నుంచి ప్రకటనలు వచ్చాయి. కేటీఆర్ నేతృత్వంలో పార్టీ మరింత పురోగమిస్తుందని అభివృద్ధి సాధిస్తుందని.. ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ సీనియర్లు ఎవరో కాదు పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని లాంటి వాళ్లే. వీరే కాదు ఎన్టీఆర్‌ టైంలో టీడీపీ లోకి వచ్చి ఎన్టీఆర్‌కు జైకొట్టిన నేతలు ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉండి కేటీఆర్‌కు జై కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయాలను చూస్తే అర్థమైపోతుంది. తుమ్మల నాగేశ్వరరావు, కడియం లాంటి నేతలు ఎన్టీఆర్‌తో కలిసి ప్రజాజీవితంలో అడుగు పెట్టినప్పుడు కల్వకుంట్ల తారక రామారావుకు బహుశా గోటీలు ఆడుకుంటూ ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆయన నాయకత్వంలో పని చేయాల్సి వస్తోంది. ఆ నేత కటాక్షం కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తోంది. నాడు ఎన్టీఆర్ చల్లని చూపు కోసం ప్రయత్నించిన వారు టీఆర్ఎస్‌లో ఇప్పుడు ఎందరో. వారంతా ఇప్పుడు కేటీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి విన్యాసాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. వీరంతా ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో తిరుగులేని అధికారం చెలాయించిన వారే.