టీఆర్ఎస్ లోకి ప్రతాప రెడ్డి…ఎమ్మెల్యేగా పోటీ !

గజ్వేల్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ పై పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతున్నారట. శుక్రవారం సాయంత్రం ఆయన కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలయ్యింది. గజ్వేల్ లో బలమైన అనుచర వర్గం ఉన్న నేత అయిన ప్రతాప్ రెడ్డి రెండు సార్లు కేసీఆర్ పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు.. ఉస్మానియా యూనివర్శిటీలో తన నియోజకర్గానికి చెందిన ఓ విద్యార్థి ఉద్యోగం లేదన్న కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతన్ని పరామర్శించడానికి వెళ్లినప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ పై ఓ రేంజ్లో పోరాటం చేశారు. టీడీపీ బలం సరిపోవడంలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడో పేడో అన్నట్లుగా కేసీఆర్ పై పోరాడారు. గత ఎన్నికల సమయంలో ఆయన కేసీఆర్ పై తీవ్రమైన పోరాటమే చేశారు. పోలీసుల వేధింపులు ఎదుర్కొన్నారు. కానీ పరిస్థితి కలిసి రాలేదు. చివరికి రాజకీయ భవిష్యత్ కోసం టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పని చేసి.. తెలుగు రైతు అధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రతాప్ రెడ్డి.. కొంత కాలంగా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. తాజా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆయన వీవీ ప్యాట్ మిషన్లలోని స్లిప్పులు లెక్కించారని ఈసీకి ఫిర్యాదు చేశారు. స్పందించకపోతే కోర్టుకెళ్తానని కూడా హెచ్చరించారు. అయితే అనూహ్యంగా ఆయన టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశం ఉండగా అదే జరిగితే ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు. అప్పుడు అక్కడ ఉపఎన్నికల్లో.. టీఆర్ఎస్ తరపున ప్రతాప్ రెడ్డికి చాన్సిస్తానని కేసీఆర్ నుంచి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది. ఏమవనుందో మరి.