లక్కీ కీర్తి…ఈసారి సూపర్ స్టార్ పక్కన !

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించేందుకు ‘మహానటి’ కీర్తి సురేశ్ కి చాన్స్ వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక ఫాంటసీ చిత్రంలో రజనీ సరసన కీర్తిసురేశ్ నటించనున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ‘పేట’ హిట్‌తో జోరుమీదున్న రజనీకాంత్‌కు కొన్ని రోజుల క్రితం ఓ ప్రాజెక్టు గురించి చెప్పానని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అని మురుగదాస్ చెప్పాడు. ఇది పూర్తిగా ఫాంటసీ చిత్రమని పేర్కొన్నాడు. అయితే ఈ కథకు కీర్తి బాగా సరిపోతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం కీర్తి సురేశ్ ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది. ఇటీవల తెలుగులోనూ ఓ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. రాజమౌళి రూపొందిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలోనూ కీర్తిసురేశ్ నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్త కూడా ఊహాగానమే. చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన లేదు. కాగా, కీర్తి సురేశ్ ఇటీవల ‘సర్కార్’ సినిమా కోసం మురుగదాస్‌తో కలిసి పనిచేసింది. ఈ నేపథ్యంలోనే కొత్త చిత్రంలో ఆమెను తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.