కెసిఆర్ కి థర్డ్ ఫ్రంట్ సాధ్యమేనా

KCR Plans Third Front with Local Parties

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
తెలంగాణ ముఖ్యమంత్రి మరోసారి సంచలనం సృష్టించారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలతో కూటమి ఏర్పాటు చేస్తామని ఆయన చేసిన ప్రకటన ఆషామాషీదేమీ కాదు. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ విషయం మీద చర్చ సాగుతోంది. దిగ్గజ నేతలంతా ఈ పరిణామాల మీద చర్చించడం చూస్తుంటే కెసిఆర్ సక్సెస్ మాట ఎలా వున్నా ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో బీజేపీ, కాంగ్రెస్ లతో సంబంధం లేని ప్రత్యామ్న్యాయ కూటమి అవసరం ఉందన్న వాదనకి మాత్రం బలం చేకూరింది.

థర్డ్ ఫ్రంట్ అవసరం ఎలా వున్నా దానికి కెసిఆర్ నాయకత్వం వహిస్తానని చెప్పడానికి ప్రధాన కారణం తెలంగాణాలో ఆయన రెండు జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడటమే. జాతీయ స్థాయిలో ఆ పార్టీలు బలహీనంగా ఉంటేనే ఇక్కడ వారితో పోరాటం తేలిక అవుతుంది. లేదంటే అన్నీ ఇబ్బందులే. అందుకే కెసిఆర్ ముందుకు వచ్చారు. అయితే కెసిఆర్ అనుకున్నట్టు కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు ఏదో విధంగా లేకుండా కేంద్ర ప్రభుత్వమే ఏర్పడే అవకాశాలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ కెసిఆర్ అండ్ కో ఆశించినట్టు ఆ రెండు పార్టీలు పూర్తిగా దెబ్బ తిని ప్రాంతీయ పార్టీల బలం పెరిగినప్పటికీ ఆ కూటమికి ఎవరు నాయకత్వం వహించాలి అన్న సమస్య అలాగే ఉంటుంది. అప్పుడు మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేయగలిగే సత్తా మాత్రమే వున్న తెరాస అధినేత ఓ జాతీయ స్థాయి కూటమికి నాయకత్వం వహించడం అన్నది తేలిక కాదు. అయితే ఇలాంటి కూటమికి బీజేపీ లేదా కాంగ్రెస్ లాంటి పార్టీలు కనీసం బయట నుంచి అయినా మద్దతు ఇస్తేనే నిలిచినా, నిలవకపోయినా కనీసం ప్రభుత్వం అయినా ఏర్పడుతుంది. లేదంటే ఆ అవకాశమే లేనట్టు. అందుకే ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ లో చేరాలని ఉత్సాహపడుతున్న పార్టీల ప్రధాన శత్రువు మోడీ కాబట్టి, కనీసం ఆయన్ను ఓడించేదాకా అయినా కాంగ్రెస్ తో ఎంతోకొంత సంయమనం పాటించడం అవసరం. కానీ కెసిఆర్ కి తెలంగాణ రాజకీయాల కోణంలో అదెటు సాధ్యం కాదు. అంటే థర్డ్ ఫ్రంట్ కి కెసిఆర్ నాయకత్వం వహించడం, దాన్ని ఇతర ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోవడం కష్టం. కాదని ముందుకు వెళితే థర్డ్ ఫ్రంట్ ఇంతకుముందులాగే మరో విఫల ప్రయోగం అవుతుంది.