ఆంధ్రోళ్ళ మీద కేసీఆర్ ప్రేమ అందుకేనా !

ప్ర‌శాంతంగా ఉన్న తెలంగాణ‌లోకి ఉడుములాగ చంద్ర‌బాబు నాయుడు వ‌స్తున్నార‌ని నిన్నటి ప్రసంగంలో ఆరోపించారు కేసీఆర్‌. ఇక్క‌డ ఆయ‌న అవ‌స‌రం ఏముంది, వ‌చ్చి ఏం చేస్తారు, ఆయ‌న అవ‌స‌రాన్ని ఇక్క‌డి ఆంధ్రుల‌కు అంట‌గ‌ట్ట‌డ‌మేంటి అని ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రులు ఎప్పుడో తెలంగాణ బిడ్డ‌లు అనీ, ఇదే మాట కొన్ని వేల‌సార్లు తాను చెప్పాన‌న్నారు. జి.హెచ్‌.ఎం.సి. ఎన్నిక‌ల త‌రువాత ఆంధ్రులు త‌మ‌కు ఓట్లెయ్య‌లేద‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి దుర్మార్గంగా మాట్లాడార‌ని గుర్తుచేశారు. తాము ఎప్పుడూ అలాంటి మాట‌లు మాట్లాడ‌లేద‌న్నారు కేసీఆర్‌. ఆంధ్రా నుంచి ఎప్పుడో వ‌చ్చిన‌వారు ఇక్క‌డున్నార‌నీ, రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉన్న‌వారు నాయ‌కులు అయ్యార‌న్నారు. ఆంధ్రా నుంచి వ‌చ్చిన‌వారు ఎవ‌రున్నా మీరు ఆంధ్రా అనే భావం వదిలేసి తెలంగాణ పౌరులుగా భావించాల‌న్నారు. గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఈ స‌మ‌స్య‌ల లేద‌నీ, ఇప్పుడు చంద్ర‌బాబు రావ‌డం వ‌ల్ల‌నే మ‌ళ్లీ వ‌స్తుంద‌ని విమ‌ర్శించారు. ఆనందంగా అన్న‌ద‌మ్ముల్లా బ‌తికేవాళ్ల మ‌ధ్య కొర్రాయి పెట్ట‌డానికా ఆయ‌న వ‌చ్చేద‌ని ప్ర‌శ్నించారు.

kcr and chandra babu

తెలంగాణ‌లోని ఆంధ్రుల‌కు చంద్ర‌బాబు నాయుడు శ‌ని అని కేసీఆర్ తీవ్రంగా విమ‌ర్శించారు. ఉద్య‌మ స‌మ‌యంలో ఆస్తులు గుంజుకుంటార‌ని చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్ ప్ర‌చారం చేసింద‌నీ, కానీ అలాంటి ఇక్క‌డుందా అని కేసీఆర్ అన్నారు. అదేమి విడ్డూరమో కానీ ఇప్పుడు తెలంగాణ‌లోకి చంద్ర‌బాబు కొత్త‌గా వ‌స్తున్న‌ట్టు కేసీఆర్ మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్ప‌ట్నుంచో ఇక్క‌డా ఉంది క‌దా. నేడు గులాబీ నీడన ఉన్న పసుపు నేతలు ఎంతమంది..? టీడీపీకి పరోక్షంగా మహాకూటమికి ఇక్క‌డున్న సెటిల‌ర్స్ మ‌ద్ద‌తు ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌నేది కేసీఆర్ ఆందోళ‌న ద్వారా స్ప‌ష్ట‌మౌతోంది! అందుకే గత ఎన్న్నికల్లో ప్రాంతీయ భావాలూ రెచ్చగొట్టిన కేసీఆర్ చాలా జాగ్ర‌త్త‌గా అంద‌రూ త‌న వాళ్లే అనే భావ‌జాలాన్ని మ‌రింత బ‌లంగా వినిపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇంత‌కీ టీడీపీ మీద తెలంగాణ ప్ర‌జ‌ల‌తోపాటు, సెటిల‌ర్ల‌లో కూడా వ్య‌తిరేక‌త‌ను పెంచేందుకు ఇంత‌గా ఎందుకు ప్ర‌యాస‌ప‌డుతున్నారు..? ఇక్క‌డ డిపాజిట్లు కూడా టీడీపీకి రావ‌నుకున్న‌ప్పుడు ఆ పార్టీని ఎందుకు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి..? అనేది కేసీఆర్ సారుకే ఎరుక!