చలించిపోయిన కేసీఆర్ సతీమణి

చలించిపోయిన కేసీఆర్ సతీమణి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వారి నివాసం కూలిపోయింది. దీంతో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు. కనీసం తలదాచుకోవడానికి ఇల్లు కూడా లేకపోవడంతో గ్రామంలో ఉన్న మున్నూరు కాపు కులసంఘ భవనంలో నివాసం ఉంటున్నారు. అయితే వీరి ధీన స్థితి మీడియాలో రావడంతో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ చూసి చలించిపోయారు.

దీంతో వెంటనే వారి కుటుంబానికి సాయంగా కేసీఆర్ సతీమణి శోభమ్మ లక్ష రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. అంతేకాదు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు ఫోన్ చేసి తిరుపతి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయాలని సూచించారు. దీంతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సీఎం కేసీఆర్ భార్య ప్రకటించిన లక్ష రూపాయలతోపాటు మరో రెండు లక్షల రూపాయలు కలిపి మూడు లక్షల రూపాయలు తిరుపతి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేస్తామని, పిల్లలను గురుకుల పాఠశాలలో చదివిస్తామని హామీ ఇస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.