చిన్నారులకు, మహిళలకు, వృద్ధులకు చలికి బుగ్గలు ఎర్రగా, చేతులు పొడిగా మారతాయి.పెదాలు, పాదాల పగుళ్లు, చర్మం చిట్లడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. మెడ కండరాలు పట్టేయడం వంటి ఇబ్బంది తలెత్తుతుంది. ఈ కాలంలో ఎదురయ్యే ఈ సమస్యలకు అన్ని వయసులకు చెందిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
సూర్యరశ్మి ‘విటమిన్ డి’ని ప్రసాదించే సహజ మూలం. ఇది మనం ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన చాలా ముఖ్యమైన విటమిన్. కానీ శీతాకాలంలో సూర్యరశ్మికి చాలా ఎక్కువ విలువ ఉంటుందని అందరికీ తెలియదు. విటమిన్ డిని మించిన ప్రయోజనాలు సూర్యరశ్మితో ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు.
అందువల్ల ఉదయం సమయంలో సూర్యోదయం తర్వాత ఉదయం 8 గంటల లోపు సుమారు 25 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో కూర్చోవడం చాలా విలువైనదని వారు వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే సూర్యాస్తమయం సమయంలోనూ ఎండలో కూర్చుంటే శరీరానికి విటమిన్ డి లభిస్తుందని చెప్తున్నారు.
విటమిన్ డి అనేది రోగనిరోధక వ్యవస్థకు, శరీరానికి శక్తి అందించేందుకు కూడా గొప్పగా ఉపయోగపడే హార్మోన్. సూర్యకాంతిలో ఉన్న UVA రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, శ్వాసక్రియ రేటును కూడా తగ్గిస్తుంది.
సూర్యకాంతిలో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్, డోపమైన్ మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించడమే కాకుండా మీలో ఆందోళన, డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా సూర్యరశ్మి మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మెలటోనిన్ నిద్ర హార్మోన్‌ను తయారు చేయడంలో మీకు సహాయపడుతుంది.
సూర్యరశ్మి వల్ల శరీరానికి కలిగే అనేక ప్రయోజనాలను చూసిన తర్వాత మీరు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని గుర్తుంచుకోవాలి. అయితే సూర్యరశ్మిలో అతిగా ఉండవద్దు. ఎండలో అతిగా ఉండటం వల్ల చర్మం అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చలి గాలి సోకనివ్వకుండా చిన్నారులు, వృద్ధులు ఒంటిపైన మందపాటి దుస్తులు ధరించాలి.
చెవుల్లోకి గాలి చొరబడకుండా మఫ్‌లర్, స్కార్ఫ్, మంకీక్యాప్ వంటివి తలపై నుంచి మెడభాగం వరకూ కప్పుకోవాలి. ఆస్తమా, ట్రాన్స్‌లైటిస్ ఉన్నవారు చెవిలో దూదిని తప్పక పెట్టుకోవడం మంచిది. చిన్నారులు, వృద్ధులు ఉదయం ఎనిమిదిలోపు, సాయంత్రం నాలుగు తర్వాత వచ్చే నీరెండలో కనీసం ఇరవై నిమిషాలపాటు అయినా ఉండేలా చూసుకోవాలి.
ఆహార నియమాలు తప్పక పాటించాలి. ఎక్కువ సమయం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఈ కాలంలో శరీరంలో ఉండే హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల కారణంగా అరుగుదల ఆలస్యంగా జరుగుతుంది.
వీలైతే తినటానికి కొద్దిసేపు ముందు వండుకోవాలి. అటువంటి అవకాశం లేకపోతే, హాట్‌బాక్సులు వాడటం మంచిది. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పదార్థాలను వీలైనంత వరకు తగ్గించి వాటి స్థానంలో వేడి వేడిగా రైస్, టమాటా, కార్న్, వెజిటబుల్ సూప్‌లను తీసుకోవాలి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచేందుకు తోడ్పడతాయి.
ఈ కాలంలో చర్మంపై దద్దుర్లు, అలర్జీలు వస్తుంటాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే, ధరించే ఉన్ని దుస్తుల్ని, కప్పుకునే రగ్గులు, దుప్పట్లను రోజూ ఎండలో పెడుతుండాలి. అలా చేయడం వల్ల అందులో ఉండే దుమ్ము, క్రిములు నశించి అలర్జీల వంటివి దరిచేరనివ్వకుండా ఉంటాయి. బెడ్ షీట్లను, దిండు గలేబుల్ని కనీసంగా వారంలో రెండుసార్లు మార్చుకోవాలి.
చలి కారణంగా రెండు పూటలా స్నానం చేయడానికి వెనకాడతాం. కానీ, రెండుపూటలా గోరువెచ్చని నీటితో స్నానం చేయటం మంచిది. పిల్లలకు సున్నిపిండిలో పసుపు, పాల మీగడ, వెన్న, నువ్వులనూనెల వంటివి చేర్చి శరీరానికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి. మహిళలు, వృద్ధులు స్నానం చేసే ముందు కొబ్బరినూనె పట్టించుకుని, గ్లిజరిన్ సబ్బుని వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వంటివి రావు.
కొందరికి చలి కాలంలో కాళ్లు పగులుతాయి. అటువంటి వారు గోరువెచ్చని నీటిలో ఒక స్పూను కొబ్బరినూనె వేసి పాదాల్ని అందులో పెట్టుకోవాలి. రాత్రి పడుకునే ముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకోవాలి.చలికి ప్రధానంగా మెడ నరాలు పట్టేయడం, బెణకడం, తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా నడి వయసుల వారిని ఈ సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అటువంటి వారు ఉదయం, సాయంత్రం పదీ పదిహేను నిమిషాల పాటు కాళ్లూ చేతులూ, మెడ కదుపుతూ వ్యాయామం చేయాలి. గర్భిణులు కూడా ఈ కాలంలో ఒకే దగ్గర ఎక్కువ సేపు కూర్చోకుండా మధ్యమధ్యలో అటూ ఇటూ తిరుగుతూ ఉండాలి. అలా చేయడం వల్ల తల్లి చురుగ్గా ఉండటమే కాకుండా బిడ్డకూ మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
సన్‌స్క్రీన్ లోషన్స్ ఎండాకాలంలో మాత్రమే కాదు, ఈ సమయంలోనూ అవసరమే. చలికాలంలో ఎండ చురుక్కుమంటుంది. అసలే చర్మం పొడిబారి ఉంటుంది. అటువంటప్పుడు ఈ ఎండ చర్మంపై మరింత ఇబ్బంది పెడుతుంది. లోషన్‌కు బదులు వెన్న, కొబ్బరి నూనె రాసుకుంటే మేలు. శరీరంతోపాటు జుట్టుకు కూడా పొడిబారడం, చిట్లటం, చుండ్రు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆముదం, కొబ్బరినూనె, ఆలివ్ వంటివి జుట్టుతత్వం బట్టి వాడుకొని, జుట్టుని సంరక్షించుకోవచ్చు.
చలికాలంలో దాహం వేయట్లేదని నీళ్లు తాగడం తగ్గించేస్తాం. శరీరానికి తగిన నీటిని అందించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి అవసరమైనంత నీటిని తాగాలి. చిన్నారులు, గర్భిణులు, వృద్ధుల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండదు కాబట్టి, నీటిని కాచి వడబోసుకుని తాగాలి. ఈ కాలంలో దొరికే అన్నిరకాల పళ్లు, ఆకుకూరలు, కాయగూరల్ని తీసుకోవాలి. సోయా, చిక్కుళ్లు వంటి ప్రోటీన్లు గల గింజ ధాన్యాలు తీసుకోవాలి.
పీచు పదార్థాల్ని ఆహారంలో తప్పక జోడించుకోవడం వల్ల వృద్ధులకు, గర్భిణులకు మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలర్జీ దరిచేకుండా ఉండాలంటే, ఈ కాలంలో దొరికే కమలాలు, ఉసిరి వంటి ‘సి’ విటమిన్ ఉన్న పండ్లను తీసుకోవాలిగది, ఆరుబయట, ఇంటి పరిసరాలు పొడిగా ఉండేలా చూసుకోవాలి. దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా జాగ్రత్తల్ని తీసుకోవాలి. చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, శ్వాసకోస సమస్యలున్నవారు పొగతో వచ్చే దోమ సంహారకాల్ని వాడకపోవడం మంచిది.