తండ్రికి ధీటుగా తనయుడు

తండ్రికి ధీటుగా తనయుడు

కాల భైర‌వ‌.. ఇప్పుడు టాలీవుడ్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన పేరు. ముందు కీర‌వాణి కొడుకుగానే అంద‌రూ అత‌ణ్ని చూసేవాళ్లు కానీ.. ఇప్పుడు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుని వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకెళ్తున్నాడు. బాహుబ‌లి-2లో దండాల‌య్యా పాట‌తో కాల‌భైర‌వ ప్ర‌తిభేంటో ముందు జ‌నాల‌కు తెలిసింది. తండ్రిని పోలిన గాత్రంతో ఆ పాట‌ను అద్భుతంగా పాడి ప్ర‌శంస‌లందుకున్నాడ‌త‌ను.

ఆ త‌ర్వాత అర‌వింద స‌మేత‌లో పెనివిటి పాట కూడా అత‌డి ప్ర‌త్యేక‌త‌ను చాటింది. అలా వ‌రుస‌గా పాట‌లు పాడుతున్న కాల‌భైర‌వ గాయ‌కుడిగా సెటిల‌వుతాడేమో అని అంతా అనుకున్నాడు. కానీ త‌న సోద‌రుడు సింహా హీరోగా ప‌రిచ‌య‌మైన మ‌త్తు వ‌ద‌ల‌రా సినిమాతో త‌ను సంగీత ద‌ర్శ‌కుడి అవ‌తార‌మెత్తి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

నేప‌థ్య సంగీతం కీల‌కంగా మారిన ఆ థ్రిల్ల‌ర్ సినిమాతో కాల‌భైర‌వ‌కు మంచి పేరే వ‌చ్చింది. దీంతో సంగీత ద‌ర్శ‌కుడిగా అవ‌కాశాలు వ‌రుస‌క‌ట్టాయి. ఈ ఏడాది కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా మూడు సినిమాలు అనౌన్స్ కావ‌డం విశేషం. అందులో ఒక‌టి.. క‌ల‌ర్ ఫోటో. క‌మెడియ‌న్ సుహాస్ హీరోగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిరాజేష్ నిర్మించిన చిత్ర‌మిది. దీని పాట‌లు ఇప్ప‌టికే బాగా పాపుల‌ర్ అయ్యాయి. సంగీత ద‌ర్శ‌కుడిగా కాల‌భైర‌వ కెరీర్‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఇద‌వుతుంద‌ని భావిస్తున్నారు.

గ‌త నెల రోజుల వ్య‌వ‌ధిలో కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్న చిత్రాలు ఇంకో రెండు అనౌన్స్ అయ్యాయి. అందులో ఒక‌టి స‌త్య‌దేవ్, త‌మ‌న్నా జంట‌గా న‌టిస్తున్న గుర్తుందా శీతాకాలం కాగా.. ఇంకోటి సితార ఎంట‌ర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేన‌ర్లో కృష్ణ అండ్ హిజ్ లీల జంట‌ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ, శ్ర‌ద్ధ శ్రీనాథ్ క‌ల‌యిక‌లో రాబోతున్న కొత్త చిత్రం. మొత్తానికి వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకెళ్తున్న కాల‌భైర‌వ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకునేలా ఉన్నాడు.