క‌ళ్ల‌తో న‌వ్వుతున్న మ‌హాన‌టి

keerthi suresh look release on mahanati movie

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సావిత్రి…తెలుగు తెరపై హీరోయిన్ ప‌దానికి అస‌లైన నిర్వ‌చ‌నం. హీరోయిన్ గా ఆమె అధిరోహించిన‌న్ని శిఖ‌రాలు మ‌రెవ‌రూ ఎక్క‌లేదు. ఆమె సినిమాల నుంచి, ఈ లోకం నిష్క్ర‌మించి ద‌శాబ్దాలు గడుస్తున్నా..ఇప్ప‌టికీ తెలుగు లోగిళ్ల‌న్నీ ఆమె గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాయి. తెలుగు సినిమా ఉన్నంత‌కాలం మాట్లాడుకుంటూనే ఉంటాయి. సావిత్రి తిరుగులేని హీరోయిన్ గా ఎంత వైభ‌వం అనుభ‌వించిందో…వ్య‌క్తిగ‌త జీవితంలో అంత ప‌త‌నం చ‌విచూసింది. ఆమె జీవితంలో ఓ సినిమాకు స‌రిప‌డా మ‌లుపులున్నాయి. అంత‌కుమించిన నాట‌కీయ‌తా ఉంది.

సినిమాల్లో అడుగుపెట్ట‌డం..కొంత‌కాలానికే విశేష పేరు ప్ర‌ఖ్యాతులు సాధించ‌డం, అంతులేని సంప‌ద సొంతంచేసుకోవ‌డం, ఖ‌రీదైన కార్లు, రాజ‌మ‌హ‌ల్ ను త‌లపించే ప్యాలెస్ లు, కీర్తి ప్ర‌తిష్ట‌లు, వైభ‌వోపేత‌మైన జీవితం..ఇది నాణేనికి ఒక వైపు. మ‌రోవైపు..వ్య‌క్తిగ‌త జీవితంలో అసంతృప్తి, భ‌ర్త నిరాద‌ర‌ణ‌, మ‌ద్యానికి బానిస కావ‌డం, అంతులేని దాన‌ధ‌ర్మాలతో క‌రిగిపోయిన ఆస్తి…వెండితెరను ఏలిన చోటే..చిన్న‌చిన్న క్యారెక్ట‌ర్లు పోషించాల్సిన ప‌రిస్థితి..ఇది సావిత్రి జీవితంలోని మ‌రో కోణం.

సావిత్రి త‌న జీవితంతో హీరోయిన్ల‌కు ఓ సందేశం మిగిల్చి వెళ్లారు. న‌ట‌న ప‌రంగా ఎలా ఉండాలి…వ్య‌క్తిగ‌త జీవితంలో ఎలా ఉండ‌కూడ‌దు అనేది సావిత్రి త‌రం త‌ర్వాతి హీరోయిన్లు ఆమె నుంచి నేర్చుకున్నారు. అంతులేని సుఖం, భ‌రించ‌లేని క‌ష్టం క‌ల‌యిక అయిన సావిత్రి జీవితంలోని ఎత్తుప‌ల్లాల‌ల‌ను, అస‌లు నిజాల‌ను సినిమావాళ్లే కాదు..సామాన్య ప్ర‌జ‌లూ తెలుసుకోవ‌డం ఎంతో మంచిది. మ‌హాన‌టి పేరుతో తెర‌కెక్కుతున్న సావిత్రి జీవితం ద్వారా ఆకాశ‌మే హ‌ద్దుగా ఎదిగిన ఓ తార‌..త‌ర్వాతి రోజుల్లో అధఃపాతాళానికి ప‌డిపోయిన తీరు..న‌టీన‌టుల‌కే కాదు…ఎంద‌రికో ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అందుకే మ‌హాన‌టి కోసం ప్రేక్ష‌కులంతా ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.

మే 9న రిలీజ్ కు సిద్ధ‌మ‌యిన మ‌హాన‌టి నుంచి…చిత్ర యూనిట్ పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ వ‌రుస‌గా ఫ‌స్ట్ లుక్ లు రిలీజ్ చేస్తోంది. తాజాగా..సావిత్రిగా న‌టించిన కీర్తిసురేశ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నిండుద‌నం, హుందాత‌నం, క‌ళ్ల‌తో అన్నిర‌కాల హావ‌భావాలు ప‌లికించే నైపుణ్యం ఉన్న‌సావిత్రి పాత్ర‌కు కీర్తిసురేశ్ స‌రిపోతుందా అనుకున్న‌వాళ్ల‌కు ఈ ఫ‌స్ట్ లుక్ స‌మాధానం ఇస్తోంది. పోస్టర్ చూసిన వెంట‌నే ఒక్క క్ష‌ణం సావిత్రేనేమో అన్న సందేహం క‌లుగుతుంది. స‌గం మాత్ర‌మే క‌నిపిస్తున్న కీర్తిసురేశ్ సావిత్రి కాలం నాటి చీర‌క‌ట్టుకుని క‌ళ్ల‌తో న‌వ్వుతూ చూస్తోంది. సావిత్రి పాత్ర‌లో కీర్తిసురేశ్ జీవించిదని చిత్ర‌యూనిట్ చెబుతున్న మాట‌ను ఈ పోస్ట‌ర్ నిజం చేస్తోంది