‘నేను.. శైలజా’ మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యారు కీర్తి సురేశ్. ఈ మూవీలో ముద్దుగా, కాస్తా బొద్దుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి ఆ తర్వాత ఏకంగా మహానటి సావిత్రి బయోపిక్ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో లీడ్ రోల్ పోషించే చాన్స్ కొటేశారు.
ఈ మూవీలో ఆమెకు అవకాశం రావడానికి ముఖ్యకారణం ఇప్పటి తరం హీరోయిన్ల కంటే కాస్తా బొద్దుగా, ముద్దుగా తెలుగమ్మాయిలా కనిపించడమే. ఇక ఈ మూవీలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తికి ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అచ్చం సావిత్రలా నటించి ప్రస్తుత కాలం ‘మహానటి’గా మారిపోయారు. ఈ మూవీకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు కీర్తి.
అయితే ఈ మధ్య కీర్తి డైట్ అంటు సన్నబడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన రంగేదే మూవీలో కీర్తి బక్కచిక్కినట్లుగా కనిపించారు. దీంతో ఆమె అభిమానులు ‘‘అయ్యో మరీ ఇంతలా సన్నబడిపోయారేంటి.. ఇలా అస్సలు బాగాలేరు, బొద్దుగానే బాగున్నారు’’ అంటూ తమ అసంతృప్తిని కామెంట్స్ రూపంలో వ్యక్తం చేశారు. ఇక తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేసి తన అభిమానులను మరోసారి నిరాశ పరిచారు కీర్తి.
‘నిశ్శబ్దం, యోగా నా దినచర్యలో భాగమైంది’ అంటు షేర్ చేసిన ఈ వీడియోలో కీర్తిని చూసి అభిమానులు మండిపడుతున్నారు. ఇందులో ఆమె మరింత బక్కపలుచగా కనిపించడంతో ‘మీకు ఏమైంది.. మరీ ఇంత సన్నబడ్డారు.. ఇదంతా దేనికి, అంత అవసరం ఏమొచ్చింది’ అంటు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. కాగా ప్రస్తుతం కీర్తి మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.