Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళరాజకీయాల్లో కొత్త శకం ప్రారంభిస్తూ మక్కళ్ నీది మయ్యమ్…జస్టిస్ ఫర్ పీపుల్ స్థాపించిన కమల్ హాసన్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల వర్షం కురిపించారు. కమల్ పార్టీ ప్రకటన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కేజ్రీవాల్ రాజకీయాల్లో కమల్ కు గొప్ప భవిష్యత్ ఉంటుందని జోస్యం చెప్పారు. మూడేళ్ల క్రితం ఢిల్లీలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 67 చోట్ల ఆప్ సాధించిన విజయాన్ని గుర్తుచేసిన కేజ్రీవాల్ తమ పార్టీ సాధించిన ఎన్నికలరికార్డును బద్ధలు కొట్టే శక్తి కమల్ హాసన్ కు మాత్రమే ఉందని, అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని తమిళ ప్రజలను కోరారు.
కమల్ హాసన్ ఓ నిజమైన హీరో అని, తమిళనాడు ప్రజలకు ఆయనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా కనిపిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభమే ఒకప్పుడు ఢిల్లీలోనూ కనిపించిందని, అప్పట్లో దేశ రాజధాని ప్రజలు ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకున్నట్టే, ఇప్పుడు తమిళ ప్రజలూ అదే పనిచేస్తారని తాను నమ్ముతున్నానని అన్నారు. కమల్ నీతిమంతుడని, ఆయనకు గొప్ప దృష్టి ఉందని, ఆయన ధైర్యాన్ని తాను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని అన్నారు. తాను కమల్ అభిమానినని తెలిపారు. పీపుల్స్ జస్టిస్ పార్టీ ప్రజలదని, తాను అధినాయకుడిగా రాలేదని, ప్రజల మధ్యనుంచే పుట్టుకొచ్చిన వ్యక్తినని కమల్ హాసన్ అన్నారు. దీర్ఘకాలంపాటు ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే పార్టీ ప్రారంభించానని తెలిపారు. ఒక్కమెతుకు చూస్తే చాలని, అన్నమంతా పట్టుకోవాల్సిన పనిలేదని, తన పార్టీతో ప్రజాపాలన సాగుతుందని చెప్పారు.
తమ పార్టీ జెండాలోని ఆరు చేతులు ఆరు రాష్ట్రాలను, మధ్యలోని నక్షత్రం ప్రజలను సూచిస్తాయని తెలిపారు. ప్రజలను, న్యాయాన్ని కేంద్రంగా చేసుకుని ఆవిర్భవించిన పార్టీ తమదన్నారు. పాలకులు ప్రజలకు మంచిచేసిఉంటే తాను రాజకీయాల్లోకి వచ్చేవాణ్ని కాదన్నారు. ప్రజలకు పాలకులపై నమ్మకముంటే తన పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉండేది కాదని తెలిపారు. అటు పార్టీ ప్రకటనకు కమల్ బుధవారం సాయంత్రాన్ని ముహూర్తంగా ఎంచుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కమల్ పక్కా ముహూర్తం ప్రకారమే రంగంలోకి దిగారని తమిళ ప్రజలు అంటున్నారు.
ద్రవిడ సిద్ధాంతాలను తు.చ తప్పకుండా పాటిస్తానని ప్రకటించిన కమల్ నిజానికి నాస్తికుడు. దేవుళ్లు, ముహూర్తాను ఆయన ఏ మాత్రం నమ్మేవారు కాదు. కానీ రాజకీయ పార్టీ ప్రకటనకు మాత్రం ఆయన శుభముహూర్తం చూసుకున్నారు. బుధవారం సాయంత్రం కమల్ తన పార్టీని ప్రకటించే సమయంలో భరణి నక్షత్రం ఉంది. ఆ నక్షత్రంలో పుట్టిన వారు ధరణిని ఏలుతారన్నది తమిళుల విశ్వాసం. కమల్ కూడా ఆ విశ్వాసంతోనే ఆ నక్షత్రం సమయంలో పార్టీ ప్రకటించారు. దీనికి తోడు బుధవారం తిథి షష్టి కూడా ఆయనకు కలిసి వచ్చిందంటున్నారు. మొత్తానికి రాజకీయాల్లోకి వస్తూనే కమల్ తన స్వభావాన్ని మార్చుకోవడం గమనిస్తే..ముందు ముందు ఓ రాజకీయవేత్తగా ఆయన వైఖరిలో ఎన్నో మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.