ఇంట్లో కానీ ప్రయాణిస్తున్న వాహనంలో అనూహ్యంగా మంటలు చెలరేగడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.. ఆ సమయంలో ఏం చేయాలో తోచక టెన్షన్ పడుతుంటారు. అయితే లారీలో మంటలు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ప్రమాదాన్ని ఆపడంతో రియల్‌లో హీరో అనిపించుకున్నాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లాలో ఆదివారం రోజు పశుగ్రాసం లోడ్‌తో వెళుతున్న లారీ రోడ్డుపైన ఉన్న విద్యుత్ తీగలకు తాడకంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వయనాడ్ నుంచి కొడంచేరికి చేరుకునే సమయంలో మంటలు లారీలోని గడ్డి మొత్తానికి చుట్టుముట్టాయి.
దీన్ని గమనించిన డ్రైవర్ మధ్యలోనే లారీని నుంచి దికి పారిపోయాడు. అయితే ప్రమాదాన్ని గమనించిన షాజీ వర్గీస్‌గా పేర్కొనే ఓ వ్యక్తి హీరోలా ఎంట్రీ ఇచ్చాడు. వెంటనే లారీ ఎక్కి దానిని ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆపాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అంతేగాక మంటల్లో కాలిపోతున్న లారీని కూడా రక్షించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ కెమెరాలో బంధించగా.. దీనిని ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రాణాలకు తెగించి వర్గీస్ చేసిన ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు.
ఈ ఘటనపై వర్గీస్ మాట్లాడుతూ.. మండుతున్న లోడ్‌ను కింద పడేయాడానికి జిగ్‌జాగ్ పద్ధతిలో లారీని నడిపినట్లు తెలిపారు. 25 సంవత్సరాలుగా తాను హెవీ డ్యూటీ వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో దేశవిదేశాల్లో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులను నివారించడంలో అనుభవం ఉందని, అదే ఇప్పుడు ఈ సవాలును ఎదుర్కోవడంలో సహయపడిందని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో స్నేహితులు, తెలిసిన వారి నుంచి ప్రశంసలు అందుతున్నాయని పేర్కొన్నారు. అగ్నిమాపక అధికారులు కూడా వర్గీస్ సాహసాన్ని కొనియాడారు.