టీడీపీ లోక్‌సభాపక్ష నేతగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను, ఉపనేతగా, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నానిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న నియమించారు. అయితే, ఈ పదవిని తాను సరిపోనని అందుకే దానిని తిరస్కరిస్తున్నట్టు తన ఫేస్‌బుక్‌లో కేశినేని బుధవారం ఉదయం పోస్ట్ చేయడంతో ఆ పార్టీలో కలకలం రేపుతోంది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్టీ విప్‌గా విజయవాడ ఎంపీ కేశినేని నానిని నియమించి 24 గంటలు కూడా గడవకముందే ఆ పదవులను తాను తీసుకోనంటూ కేశినేని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం గమనార్హం. ‘లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమించినందుకు చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు.. కానీ ఈ పదవిని బాధ్యతాయుతంగా నిర్వహించడాని తాను సరైన వ్యక్తిని కాదు.. నా కంటే సమర్ధవంతమైన నేతను నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. విజయవాడ ప్రజలు నన్ను ఆశీర్వదించి, మళ్లీ పార్లమెంటు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు.. ఈ పదవి కంటే నియోజకవర్గంలో సేవ చేయడమే తనకు సంతోషంగా ఉంటుంది.. తనపై నమ్మకం ఉంచిన చంద్రబాబుకు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనిని తిరస్కరిస్తున్నందుకు క్షమించాలని’కేశినేని తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు. కాగా, కేశినేని టీడీపీని వీడతారంటూ ప్రచారం సాగుతోంది. కొద్దిరోజుల కిందట కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఆయన కలవడం ఈ వార్తలకు బలం చేకూరేలా ఉంది. గడ్కరీతో భేటీ టీడీపీలో చర్చకు తెరతీసింది. అయితే ఈ ప్రచారంపై కేశినేని స్పందించారు. తాను బీజేపీలో చేరడంలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఎంపీ కేశినేని నాని నిర్ణయంపై పార్టీ స్పందించాల్సి ఉంది.