కేశినేని నాని పోరాటం…ఇంకా ఆగలేదా ?

kesineni nani fight did not stop

టీడీపీ అధినేత ఇచ్చిన లోక్‌సభ విప్ పదవి వద్దని, అందుకు నేను అర్హుడిని కాదని, తనకు ఏ పదవి వద్దని పార్టీలోనే ఉంటానని చెప్పారు ఎంపీ కేశినేని నాని. మళ్ళీ నాని తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇస్తున్న లోక్ సభ విప్ పదవిని వద్దని దుమారం రేపిన ఆయన ఆ తర్వాత చంద్రబాబుతో రెండు గంటల పాటు చర్చించి, తనకు ఏ పదవీ వద్దని చెప్పారు. పార్టీలోనే ఉంటానన్న ఆయన… తాజాగా తన ఫేస్ బుక్ అకౌంట్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. శ్రీశ్రీ రచనల్లోని ఎంతో పాపులర్ అయిన “పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంకెళ్ళు తప్ప” అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అయింది. దీన్ని చూసిన ఆయన అభిమానులు కేశినేని ఇప్పటికీ అసంతృప్తితోనే ఉన్నారని, పార్టీ వీడే అవకాశం ఉందని ఎవరి అభిప్రాయాలు వాళ్లు వ్యక్తం చేస్తున్నారు. కేశినేని నానిని బుజ్జగించేందుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రంగంలోకి దిగారు. నాని ఆఫీసుకు వెళ్లి చర్చించారు. పార్లమెంట్‌లో విప్ పదవి ఇస్తుంటే, తిరస్కరించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, పార్టీలో మొదట తనకు ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత తనను కరివేపాకులా తీసేయడం మీదే కేశినేని నాని అలిగినట్టు సమాచారం. కృష్ణా జిల్లా టీడీపీలో ఆధిపత్య పోరు ఎక్కువ. ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎంపిక, నిర్వహణ బాధ్యతలను కేశినేని నానికి అప్పగించారు పార్టీ పెద్దలు. నాని కూడా ఆ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం జరిగిన సమావేశంలో పార్టీ కార్యాలయం గురించి దేవినేని ఉమా ఫైనల్ చేస్తారని నిర్ణయం తీసుకున్నారు. మొదట తనకు బాధ్యత అప్పగించి మళ్లీ ఇప్పుడు దేవినేనికి పగ్గాలు ఇవ్వడంపై నాని అలకబూనారని సమాచారం.