టీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఎల్పీ విలీనం తప్పదా…రూల్స్ ఏమి చెబుతున్నాయి !

congress lp merger in trs

తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్‌లో చేరే ఆ ఒక్క కాంగ్రెస్‌ శాసన సభ్యుడు ఎవరనేదే ఇప్పుడు తెలంగాణా రాజకీయవర్గాల్లో అతి పెద్ద హాట్ టాపిక్. అధికార పార్టీలో సీఎల్పీ విలీనానికి ఎప్పటి నుంచో పావులు కదుపుతున్న టీఆర్‌ఎస్‌కు తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో కాస్త అవకాశం దక్కినట్టయ్యింది. ఈ మధ్య కాలంలో ఎంపీగా గెలిచిన ఉత్తమ్‌ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో సభలో కాంగ్రెస్‌ బలం 18కి తగ్గింది. సీఎల్పీ విలీనానికి మూడొంతుల్లో రెండొంతులు సభ్యుల మద్దతు అవసరం. అంటే నిన్నటి దాకా 13 మంది కావలసి వస్తే నిన్న ఉత్తమ్ రాజీనామా తర్వాత 12 మంది సభ్యులు కావాలి. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి 11 మంది సభ్యులు టీఆర్‌ఎస్‌లో  చేరనున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అవసరం అయితే తమ పదవులకి కూడా రాజీనామా చేసి చేరడానికి సిద్దంగా ఉన్నారు. వీరిలో సబితాఇంద్రారెడ్డి(మహేశ్వరం), జాజుల సురేందర్ (ఎల్లారెడ్డి), రేగ కాంతారావు(పినపాక), కందాల ఉపేందర్ రెడ్డి(పాలేరు), హరిప్రియ(ఇల్లందు), వనమా వెంకటేశ్వర రావు(కొత్తగూడెం), చిరుమర్తి లింగయ్య(నకిరేకల్), దేవిరెడ్డి సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్‌), ఆత్రం సక్కు(ఆసిఫాబాద్‌), బీరం హర్షవర్ధన్ రెడ్డి (కొల్లాపూర్‌), గండ్ర వెంకటరమణారెడ్డి (భూపాలపల్లి)లు ఉన్నారు. అంటే 12 సంఖ్యకు మరొకరు కావాలి. ఇప్పుడు ఆ ఒక్కరూ ఎవరు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆ ఒక్కరూ వచ్చేస్తే విలీనం పూర్తయినట్టే. ఇక మిగిలిన ఏడుగురి సభ్యుల్లో  ఒకరు టీఆర్ఎస్ లో చేరితే ఆ పార్టీ బలం ఆరుకు పడిపోతుంది. దీంతో వీరికంటే ఎక్కువగా ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది. ఇదే జరిగితే కాంగ్రెస్ కు దెబ్బమీద దెబ్బ తగిలినట్టే. అయితే జాతీయ పార్టీ కు చెందిన ఎమ్మెల్యేలు ప్రాంతీయ పార్టీ లో విలీనం కావడం సాంకేతికంగా సాధ్యం కాదని నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం సీఎల్పీ నేతను అధిష్ఠానమే నిర్ణయిస్తుందని, ప్రత్యేకంగా శాసనసభాపక్షం ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదని అంటున్నారు. ఇక ప్రస్తుతం శాసనసభలో కాంగ్రెస్‌ కి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, పోదెం వీరయ్య, సీతక్కలు మాత్రమే ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్ లోకి ఎవరు వెళ్తారో చూడాలి!