లాక్ డౌన్ లో ఆడుతూ అనంతలోకాలకు చేరిన చిన్నారి: షాక్ లో తల్లిదండ్రులు

తెలంగాణలో ఊయల ఊగుతోన్న సమయంలో చున్నీ మెడకు చుట్టుకొని బాలిక మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రాష్ట్రమంతా లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో స్కూళ్లన్నీ బంద్ కావడంతో పిల్లలంతా ఇంటి నుంచి గడప దాటడం లేదు. దీంతో ఇంట్లోనే రకరకాల ఆటలాడుకుంటున్నారు. దీంతో ఇంట్లో ఊయాల ఊగుతన్న ఓ చిన్నారిని మృత్యువు కబళించింది. ఊయల బాలిక ప్రాణం తీసింది. సిద్ధిపేట జిల్లాలోని బెజ్జంకి మండలం కల్లేపల్లిలో ఈ విషాదం చోటు చేసుకుంది.

అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే… ఆ గ్రామానికి చెందిన పబ్బతి నర్సయ్య, సరోజ దంపతులకు 14 ఏళ్ల దివ్య అనే కుమార్తె ఉంది. స్కూల్‌కు సెలవు కావడంతో ఇంట్లోనే ఉంది. సరదాగా ఆడుకోవడంలో భాగంగా కాసేపు ఇంట్లోనే ఊయల ఊగుదామనుకుంది. అయితే అదే ఊయల దివ్యకు యమపాశమైంది.

కాగా ఇంట్లో దూలానికి చీరకట్టి ఊయల ఊగుతోంది. ఇదే సమయంలో దివ్య మెడలో చున్నీ ఉంది. ఆమెకు సమీపంలోనే దివ్య తల్లి ఇంటి పనులు చేసుకుంటోంది. ఊయల ఊగుతుండగా చీర చుట్టుకుపోయింది. అప్పుడు దివ్యమెడలోని చున్నీ చీరలో చిక్కుకోవడంతో మెడకు బిగుసుకొని ఊపిరాడక దివ్య మరణించింది. అయితే దివ్య తల్లి ఈ విషయాన్ని గుర్తించలేదు. ఇంటి పనుల్లో మునిగిపోయింది. పనిలో ఉన్న ఆమె కూతుర్ని పిలిచింది. ఎంతకూ దివ్య పలకలేదు. దాంతో అనుమానం వచ్చిన ఆమె వచ్చి చూసింది.
ఊయలలో విగత జీవిగా పడివున్న కూతుర్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. ఊయల్లో చిక్కుకున్న దివ్యను కిందకు దింపారు. కానీ.. అప్పటికే దివ్య చనిపోయింది. దివ్య తల్లి సరోజ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.