కానిస్టేబుల్‌ బైక్ ఆపినందుకు తండ్రీకొడుకులు లాఠీతో దాడి

కానిస్టేబుల్ బైక్ ఆపాడని వాహనాన్ని నడిపే వ్యక్తి దాడికి పాల్పడ్డ ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌పై తండ్రీ కొడుకులు దాడి చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో తాజాగా చోటుచేసుకుంది. స్థానిక రైతుబజార్ వద్ద కానిస్టేబుల్‌ భైరి జీవరత్నం విధులు నిర్వహిస్తున్నారు. టెక్కలి మండలం పరశురాంపురం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు వాకాడ శ్రీనివాసరావు, వినీత్‌లు బైక్‌పై వెళ్తున్న సమయంలో కానిస్టేబుల్‌ ఆపడం జరిగింది.

ఆ సమయంలో ఆ తండ్రీ కొడుకులు కానిస్టేబుల్‌తో గొడవపడ్డారు. బైక్ ఎందుకు ఆపావంటూ అతడిపై దాడికి దిగారు. కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీని లాక్కుని మరీ కానిస్టేబుల్ ని కొట్టారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కానిస్టేబుల్‌ను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు. కాగా వినీత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ జీవరత్నాన్ని జిల్లా ఎస్పీ కె.అమ్మిరెడ్డి పరామర్శించారు. విధుల్లో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్పీ కె. అమ్మిరెడ్డి హెచ్చరించారు. పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.