బట్టబయలైన కిడ్నాప్ డ్రామా…మరో పదిహేను రోజుల్లో పెళ్లి అనగా ?

బట్టబయలైన కిడ్నాప్ డ్రామా...మరో పదిహేను రోజుల్లో పెళ్లి అనగా ?
లండన్ నుంచి వచ్చిన ఓ హైదరాబాది కిడ్నాప్ అయ్యాడన్న సమాచారం.. శంషాబాద్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. అర్ధరాత్రి దాటిన తరువాత కిడ్నాప్‌కు గురైన యువకుడి తండ్రి నుంచి ఫోన్ కాల్ రావడంతో.. అలర్ట్ అయ్యారు. యువకుడు విదేశాలకు వెళ్లలేదని నిర్ధారించుకున్న పోలీసులు కిడ్నాప్ జరిగిందా.. లేక యువకుడు డ్రామా ఆడుతున్నాడా..? అనే కోణంలో విచారిస్తున్నారు. ప్రవీణ్ ఈసీఐఎల్ సమీపంలోని ధమ్మాయిగూడలో నివాసం ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులకు లండన్ వెళుతున్నానని చెప్పాడు .
ఆ తర్వాత కొన్ని రోజులకు పెళ్లి కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది. దీంతో మరో పదిహేను రోజుల్లో ప్రవీణ్ కు పెళ్లి కావాల్సి ఉంది. పెళ్లి కోసం బుధవారం రాత్రి లండన్ నుంచి వస్తున్నానని తల్లిదండ్రులకు చెప్పాడు ప్రవీణ్ అక్కడి వరకు బానే ఉంది.. కాని, ఆ తర్వాత ప్రవీణ్ అతని తండ్రికి ఫోన్ చేసి.. తాను ఎయిర్ పోర్టులో దిగానని, క్యాబ్ తీసుకొని ఇంటికి వస్తుండగా.. క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేసి ఎక్కడో నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడని, తనను కొట్టి, బంగారు ఆభరణాలతో పాటు నగదును తీసుకెళ్లినట్టుగా తెలిపాడు. కొడుకు ఫోన్‌ కాల్‌తో ఆందోళనకు గురైన తండ్రి శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ సమాచారంతో.. రంగంలోకి దిగిన శంషాబాద్ పోలీసులు ప్రవీణ్ తల్లిదండ్రులను తీసుకొని ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.
అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులతో మాట్లాడించడంతో.. పాటు సీసీ కెమరాలను చెక్ చేయించారు. అయితే, అక్కడ ఓ విషయం తెలిసింది. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు.. ప్రవీణ్ అసలు ఎయిర్ పోర్టుకే రాలేదని నిర్ధారించారు. ఇమ్మిగ్రేషన్‌లో కూడ అతను దేశం విడిచి వెళ్లినట్లుగా కానీ, తిరిగి వచ్చినట్లుగా కానీ.. ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో అతను దేశంలోనే ఏదో ఒక్క ప్రాంతంలో ఉండి తల్లిదండ్రులను మోసం చేయడంతో పాటు.. తమను పక్కదారి పట్టించినట్లుగా గుర్తించారు పోలీసులు. లండన్ నుంచి వస్తున్నానని, తనను కిడ్నాప్ చేశారని ప్రవీణ్ ఎందుకు డ్రామా ఆడాడో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రవీణ్ అందుబాటులోకి రాకపోవడంతో అతన్ని పట్టుకుంటేనే.. అసలు విషయం తెలిసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. పెళ్లి నచ్చక పోవడంతో.. కిడ్నాప్ డ్రామా ఆడాడా..? లేక పెళ్లి చేసుకుంటే ఆ యువతిని తనతో పాటు లండన్ కు తీసుకెళ్లాల్సి వస్తది కాబట్టి, తన డ్రామా ఎక్కడ బయటపడుతుందోనని ఈ విధంగా చేశాడా..? అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.