హయత్నగర్లో బీఫార్మసీ విద్యార్థిని సోని కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. నిందితుడు రవిశేఖర్ ఆమెను ప్రకాశం జిల్లా అద్దంకిలో వదిలి పెట్టాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి సోనీ తండ్రి యాదయ్యను వారం రోజుల కిందట నమ్మించి అతడి కుమార్తెను నిందితుడు రవి శేఖర్ కారులో ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే.
అద్దంకి బస్టాండులో సోనీని వదలిపెట్టిన నిందితుడు, అక్కడ నుంచి పరారయ్యాడు. దీంతో అక్కడున్న ఓ వ్యక్తి నుంచి ఫోన్ నుంచి తండ్రి యాదయ్య, తన మామయ్యలకు బాధితురాలు కాల్ చేసింది. సోనీని అపహరించిన నిందితుడు విజయవాడవైపు తీసుకెళ్లినట్టు గుర్తించారు.
దీంతో ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు అప్రమత్తం చేశారు. యువతి కోసం రెండు రాష్ట్రాల పోలీసులు జల్లెడపట్టారు. కాగా, 8074397083 నంబర్ నుంచి ఆమె ఫోన్ చేసినట్టు పోలీసులకు తల్లిదండ్రులు చెప్పారు. హైదరాబాద్లో కిడ్నాప్ చేసిన తనను కడప జిల్లా ఒంటిమిట్ట, తిరుపతి తీసుకెళ్లి చివరకు అద్దంకిలో వదిలి పెట్టినట్టు యువతి వెల్లడించింది.
దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ పోలీసులు అక్కడ పోలీసులను అప్రమత్తం చేశారు. యువతి మంగళవారం ఉదయం అద్దంకి నుంచి హైదరాబాద్కు చేరుకుంది. కొద్దిసేపటి కిందటే ఇమ్లిబన్ బస్స్టేషన్లో దిగిన ఆమె, పోలీసులను కలవనుంది. కాగా, నిందితుడు రవి శేఖర్ ఆచూకీ మాత్రం పోలీసులకు ఇంకా లభించలేదు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల నజరానా ఇస్తామని కూడా ప్రకటించారు.