అనాదలైన పిల్లలు….

అనాదలైన పిల్లలు....

తండ్రి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. తల్లి రోడ్డు ప్రమాదానికి గురై అనంత లోకాలకు చేరింది. ఏమైందో తెలియని ఆ చిన్నారులు దీనంగా అమ్మానాన్నల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ హృదయ విదారక చిత్రం అందరి హృదయాలను ద్రవింపజేస్తోంది. వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డికి చెందిన భవానీపేట సుజాత(30), రాజులకు ఇద్దరు సంతానం. ఆరేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. రాజు వారం క్రితం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు కామారెడ్డిలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు నిజామాబాద్‌కు రిఫర్‌ చేశారు. దీంతో డబ్బుల కోసం రాజు భార్య సుజాత(30) తన సోదరుడితో కలిసి బైక్‌పై రామారెడ్డికి వస్తుండగా గర్గుల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సుజాత కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె శనివారం మరణించింది. మరోవైపు ఆమె భర్త రాజును నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యు లు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిజామాబాద్‌లోని ఆస్ప త్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడు. తల్లిదండ్రులకు ఏమైందో తెలియని చిన్నారులు రుచిత, బంటి.. వారి రాకకోసం నిరీక్షిస్తున్నారు. పిల్లల పరిస్థితిని చూసి చుట్టుపక్కల వారు కన్నీరు పెట్టుకుంటున్నారు.