వైసీపీలో అప్పుడే మొదలయిన లుకలుకలు…!

Killi Krupa Rani Quits Congress Party

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జంపింగ్‌‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌‌లు, కీలకనేతలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే. ఎవరైతే పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నారో, ఎవరెవరికి టికెట్ రాదనీ సంకేతాలు వచ్చాయో వారంతా జంప్ చేసేస్తున్నారు. ఇప్పటికే పలువురు అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ఒక ప్రత్యామ్నాయంగా టీడీపీని చూసుకుంటే ప్రత్యామ్నాయంగా వైసీపీని చూసుకుని తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరడానికి సిద్ధమైపోయారు. నిన్న సాయంత్రం తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలు, కుటుంబీకులతో నిశితంగా చర్చించిన కిల్లి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం ఆమె వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. ఈ నెల 28వ తేదీన అమరావతిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ఆమె అలా జగన్ తో భేటీ అయ్యారో లేదో ఇలా వైసీపీలో ముసలం మొదలయ్యింది. కిల్లి కృపారాణి చేరిక ఖాయమైన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అసంతృప్తి భగ్గుమంది.

కిల్లి కృపారాణి వైసీపీలో చేరడాన్ని ధర్మాన ప్రసాదరావు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రశాంతంగా ఉన్న జిల్లా వైసీపీలో కృపారాణి రాకతో వర్గ విభేదాలు తలెత్తాయి. అయితే ధర్మాన వర్గం అసంతృప్తిపై కిల్లి కృపారాణి స్పందించారు. ధర్మాన తన చేరికపై వ్యతిరేకంగా ఉన్నారా లేరా అనేది తనకు అనవసరమని, ఆయన మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీ కోసం జిల్లాలో శక్తిమేర కృషి చేస్తానని కిల్లి కృపారాణి స్పష్టం చేశారు. ఆమెకు జగన్ శ్రీకాకుళం ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన ఈమె టీడీపీ కీలకనేత ఎర్రన్నాయుడిపై 82,987 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఒక్క సారిగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత యూపీఏలో కేంద్ర మంత్రిగా కూడా పంచి చేశారు. అయితే రాష్ట్ర విభజనాంతరం 2014 ఎన్నికల్లో పోటీచేసిన కిల్లి కేవలం 24,163 ఓట్లకే పరిమితం కాగా వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతికి 428,591 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కింజరపు రామ్మోహన్ నాయుడు ఆమె మీద 1,27,572 భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల అనంతరం ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఏడాదిగా కృపారాణి హస్తాన్ని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్న సంగతి తెలసిందే. అయితే సోమవారం సాయంత్రం ఆమెకు వైసీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. కాగా ఈమె వైసీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతి పరిస్థితి, ఆ తర్వాత నుండీ పని చేసుకుంటూ వస్తున్న టెక్కలి మాజీ ఇంచార్జ్ ఇప్పటి పార్లమెంటరీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ ల పరిస్థితి ఏంటనేది తెలియ రాలేదు.