మేమూ యుద్దానికి సిద్దంగానే ఉన్నాం…కానీ…!

Pakistan PM Imran Khan Promises Action If India Shows Pulwama Proof
పుల్వామా ఉగ్రదాడి తర్వాత తొలిసారి పాక్‌ ప్రధాని స్పందించారు. పుల్వామా దాడి ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మీడియా సమావేశం నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌ వైపు నుంచి తమపై దాడి జరిగితే తిప్పికొడతామని అన్నారు. యుద్ధం చేయడం చాలా ఈజీ అని ఆ తరువాత పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించాలని తెలిపారు. దాడి ఘటనకు సంబంధించి తమ ప్రమేయం ఉందని ఆధారాలు చూపితే దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
పుల్వామా ఉగ్రదాడికి పాకిస్థాన్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దీంతో మీడియా ముందుకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పుల్వామా దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. మరోపక్క కశ్మీర్‌ లోయలో ఎవరైనా తుపాకి పడితే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఇండియన్ ఆర్మీ హెచ్చరించింది. ఆర్మీ కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్థానిక ఉగ్రవాదుల తల్లులకు తాను ఒక్కటే మనవి చేస్తున్నానని, తమ పిల్లలు ఆయుధాలు వీడి లొంగిపోతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని లొంగిపోకుండా ఎవరైనా తుపాకులు, ఆయుధాలు పట్టుకుంటే వారిని మట్టుబెడతామని ధిల్లాన్ హెచ్చరించారు.