ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏది చేసినా ప్రపంచవ్యాప్తంగా సంచలనే అవుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు తన వైఖరితో వార్తల్లో ట్రెండింగ్‌లో నిలిచిన కిమ్.. మరోసారి సోషల్ మీడియాలో నిలిచారు. ఇంతకీ ఈసారి ఏం చేశారంటే..ఉత్తర కొరియా అధికారిక టీవీ ఛానల్ యాంకర్ రీ చున్ హీకి.. కిమ్ జోంగ్ ఉన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.
ఆమె కోసం పాంగ్యాంగ్‌లో నిర్మించిన విలాసవంతమైన ఇంటిని స్వయంగా కిమ్ అందజేశారు. ఆమె మెట్లు ఎక్కడంలో ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు సైతం ఏర్పాటు చేపించినట్టు ఉత్తర కొరియా మీడియా వెల్లడించింది.అయితే, ఉత్తర కొరియా, అధికారిక పార్టీ కోసం యాంకర్ రీ చున్ హీకి గత 50 ఏళ్లుగా సేవలు అందిస్తోంది.
కొరియా సంప్రదాయ వస్త్రధారణలో ఉండే రీ చున్.. దేశ అవసరాలకు తగ్గినట్టుగా తన స్వరాన్ని మార్చుకుంటూ యాంకరింగ్ చేస్తున్నారు. ఉత్తర కొరియాకు సంబంధించిన కీలక వార్తలన్నింటినీ ప్రజలకు తెలియచేసే రీ చున్ హీ.. విదేశీయులకూ సైతం సుపరిచితమే. కేసీఎన్ఏ టీవీ ఛానల్‌లో వార్తలు చదువుతూ ఆమె ‘పింక్ లేడీ’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
కాగా, ప్రజల్లో దేశభక్తిని ఉప్పొంగించేందుకు భావోద్వేగభరితంగా, ఒకప్పటి దేశాధినేత మరణం మొదలు.. ప్రస్తుత నియంత కిమ్ జోంగ్ ఉన్ జరిపే అణు పరీక్షలు వరకు.. ఉత్తర కొరియాకు సంబంధించిన అన్ని కీలక వార్తలను సందర్భాన్ని బట్టి స్వరాన్ని మారుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో ఆమెకు సేవలను గుర్తించిన కిమ్.. ఇలా బహుమానం అందించారు.
ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. రీ చున్‌కు అధికార పార్టీ రుణపడి ఉంటుంది. ఆమె ఆరోగ్యంగా ఉంటూ పార్టీ కోసం ఇదే ఉత్సాహంతో పనిచేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈ క్రమంలో ఆనందం వ్యక్తం చేసిన రీ చున్ హీ.. కిమ్ ఉదారతకు తన కుటుంబ సభ్యులు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారని ఉద్వేగంగా తెలిపారు. ఇదిలా ఉండగా.. రీ చున్తో పాటు పార్టీ కోసం పని చేస్తున్న దాదాపు 10వేల మందికి కూడా కిమ్.. విలాసవంతమైన ఇళ్లను కానుకగా అందజేశారు.