ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కన్ను పెంపుడు జంతువులపై పడింది. దేశ అవసరాల కోసం ప్రజలు పెంచుకుంటున్న కుక్కపిల్లలను ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆ దేశంలో కరోనా కష్ట కాలంలో ఆహార సరఫరాలో సంక్షోభం ఏర్పడింది. దీంతో రెస్టారెంట్లకు మాంసం సరఫరా తగ్గిపోయింది. అసలే అక్కడ కుక్క మాంసం ఎంతో రుచికరంగా ఉంటుందని ఎగబడి మరీ తింటారు. దీంతో ఈ సమస్యకు కిమ్ విచిత్ర పరిష్కారం కనిపెట్టారు. ప్రజలు పెంచుకుంటున్న శునకాలను వధించి రెస్టారెంట్లలో మాంసం లోటును పూడ్చాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ప్రజలు తమ దగ్గరున్న కుక్కలను ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఆదేశించారు. ఇలా ప్రభుత్వం స్వాధీనం చేసే కుక్కలను కొన్నింటిని జూలలో, మరికొన్నింటిని మాంసం కోసం నేరుగా రెస్టారెంట్లకు సరఫరా చేస్తారు.
ఈ పనులన్నీ దగ్గరుండి చూసుకునేందుకు కొందరు అధికారులను కూడా నియమించారు. శునకాలను పెంచుకుంటున్న కుటుంబాలను గుర్తించడం వీరి ముఖ్యమైన పని. ఆ తర్వాత యజమానులకు నచ్చినా నచ్చకపోయినా ఈ అధికారులు వారి నుంచి పెంపుడు శునకాలను బలవంతంగా లాక్కుపోతారు. ముందు జాగ్రత్తగా గత నెలలోనే శునకాలను పెంచుకోవడంపై కిమ్ విధించిన నిషేధం.. ఇప్పుడు చేస్తోన్న క్రూరమైన పనిని మరింత సులువు చేస్తోంది. ఈ వార్త విన్న జంతు ప్రేమికులు లబోదిబోమంటున్నారు. ఇన్నాళ్లు ప్రేమగా పెంచుకున్న వాటిని చంపేస్తారని తలుచుకుంటేనే మనసొప్పడం లేదంటూ ఘొల్లుమంటున్నారు.