కాంగ్రెస్ లోకి కిరణ్ చేరిక లాంఛనమే… బాబు ప్లానింగ్ అదిరింది.

Kiran Kumar Reddy Confirm to join in Congress

“ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదుక్కోవాలి “ అన్నది తెలుగులో ఓ పాత నానుడి. దాన్ని ఇంకోసారి నిజం చేస్తూ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నిన్న రాహుల్ సన్నిహితుడు పల్లం రాజు తో కలిసిన కిరణ్ కుమార్ రెడ్డి ని నేడు ఇంకో కాంగ్రెస్ సీనియర్ నేత టీ. సుబ్బిరామిరెడ్డి భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం ఇక లాంఛనమే అన్న అభిప్రాయం బలపడింది. అయితే ఇప్పుడు బయటకు కనపడే విషయాలకు మించిన గ్రౌండ్ వర్క్ ఇంతకుముందే జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పరిస్థితి గురించి కిరణ్ కుమార్ రెడ్డి అంచనాలు నిజం అయ్యాయని గ్రహించిన సోనియా, రాహుల్ ఆయనతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారట.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని బలోపేతం చేసేందుకు ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలని భావించి ఓ రూట్ మ్యాప్ తయారు చేయమని కోరారట. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ని దెబ్బ కొడితే తప్ప కాంగ్రెస్ నిలదొక్కుకోవడం సాధ్యం కాదని కిరణ్ తేల్చిచెప్పాకే, రాహుల్ రాష్ట్ర కాంగ్రెస్ కి దిశానిర్దేశం చేశారట. జగన్, వైసీపీ విషయంలో మెతకవైఖరి పనికిరాదని రఘువీరా అండ్ కోకి క్లాస్ పీకారట. కేవీపీ గ్యాంగ్ సైతం ఆంధ్రాలో జగన్, తెలంగాణ లో కెసిఆర్ కి మేలు చేసేందుకు కాంగ్రెస్ లో ఉంటూనే ఆ పార్టీకి గండి కొడుతున్న విషయాన్ని కూడా రాహుల్ దృష్టికి కిరణ్ తీసుకెళ్లారట. దీంతో అధికారికంగా కిరణ్ ని పార్టీలోకి తీసుకుని ఆయన సేవలు వాడుకోవాలని 10 జన్ పథ్ ఫిక్స్ అయిపోయిందట.

ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి వైసీపీ అధినేత జగన్ తో పాటు కాంగ్రెస్ లో శల్య సారధ్యం చేసేవాళ్లంతా మండిపడుతున్నారు. కిరణ్ వ్యూహాల వెనుక చంద్రబాబు ప్లానింగ్ ఉందని వీరందరి డౌట్. కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ లో చేరిన సమయంలో ఇద్దరి మధ్య ఏర్పడ్డ బంధం బలంగా మారిందని వీరి ఆరోపణ. కాంగ్రెస్ తో దగ్గర కావాలి అనుకుంటున్న బాబు ఓ వ్యూహంతో కిరణ్ ని హైకమాండ్ కి దగ్గర చేశారు అని వైసీపీ సందేహం. పైగా జనసేన పోటీ వల్ల టీడీపీ కి జరిగే నష్టాన్ని పూరించడానికి కాంగ్రెస్ రూపంలో వైసీపీ ని దెబ్బ తీయడానికి బాబు ఈ విధంగా పావులు కలిపాడని జగన్ కూడా నమ్ముతున్నారట. ఏదేమైనా కిరణ్ రాజకీయంగా తిరిగి క్రియాశీలం కావడం తెలుగు పాలిటిక్స్ లో సరికొత్త మార్పులకు దారి వేసేలా అనిపిస్తోంది.