గంటాకి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు, కానీ…!

Ganta Srinivas comments on CM Ramesh and BTech Ravi Hunger Strike

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతలు సీఎం రమేష్‌, బీటెక్‌ రవి చేస్తోన్న ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదవ రోజు కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం మంత్రి గంటా శ్రీనివాస్ అలక టీడీపీలో ఆందోళన కలిగించింది. ఐతే, ఒకట్రెండు రోజుల్లోనే గంటా అలక పాన్పు దిగేలా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గంటాతో మాట్లాడి సమస్యని పరిష్కారించారు. అలాగే తాజాగా, సీఎం చంద్రబాబు గంటాకు పెద్ద బాధ్యతని అప్పగించినట్టు తెలుస్తోంది. గంటాను అత్యవసరంగా కడప వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారు. కడపలో ఉక్కు ప్లాంటు ఏర్పాటును డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింతగా విషమించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంటాని అత్యవసరంగా కడపకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.

దీక్ష చేస్తున్నసీఎం రమేష్, బీటెక్ రవిలతో చర్చించి, వారిని ఆసుపత్రికి వెళ్లేలా చూడాలని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. సీఎం ఆదేశంతో మంత్రి గంటా హుటాహుటిన కడపకు బయలుదేరారు. అయితే, బీటెక్‌ రవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు తక్షణం చికిత్స అవసరమని రిమ్స్‌ వైద్యులు చెప్పారు. సీఎం రమేష్‌ పరిస్థితి కూడా బాగోలేదని అన్నారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు ఆదేశాలతో సీఎం రమేష్‌, బీటెక్‌ రవి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు వచ్చానని అన్నారు. కలెక్టర్‌, రిమ్స్‌ వైద్యులతో మాట్లాడానని, బీటెక్‌ రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారని అన్నారు. దీక్ష విరమించాలని తాము కోరితే, వారు వినిపించుకోవట్లేదని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబుతో మాట్లాడతానని, అనంతరం రవిని బలవంతంగానైనా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తామని అన్నారు.